
కొండలమ్మకు రూ.17.75లక్షల ఆదాయం
గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారి దేవస్థానం హుండీల్లోని కానుకలను బుధవారం లెక్కించగా రూ.17,75,841 నగదు వచ్చింది. భోగిరెడ్డిపల్లి ఈఓ అరుణ పర్యవేక్షణలో దేవదాయ సిబ్బంది హుండీలను తెరిచి లెక్కించగా మొత్తం 41రోజులకు గానూ నోట్ల ద్వారా రూ.16,16,601, చిల్లర ద్వారా రూ.1,59,240 వెరసి మొత్తం రూ.17,75,841 వచ్చింది. బంగా రం 27గ్రాములు, వెండి 1.2 కేజీలు వచ్చింది.
నైపుణ్యాభివృద్ధితో ఉన్నతి
ఆత్కూరు(గన్నవరం): నైపుణ్యాభివృద్ధితో జీవితంలో ఉన్నతిని సాధించవచ్చని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో బుధవారం శిక్షణార్థులతో కలిసి ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ద్వారా యువత భవిష్యత్ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని, నైపుణ్యాభివృద్ధికి ఈ రెండు దారి దీపాలుగా నిలుస్తాయని చెప్పారు. ముఖ్యంగా యువత స్వయం సమృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నించడం కంటే, నలుగురికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువత ఎదగాలని ఆకాంక్షించారు.
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు బుధవారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. విజయవాడ గవర్నర్‌పేటకు చెందిన మానేపల్లి వెంకట పద్మావతి, వెంకటలక్ష్మి రాజాలు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ ఏఈవో ఎన్. రమేష్‌బాబుకు అందచేశారు. అలాగే భీమవరానికి చెందిన ఎం.రేణుక స్వాతి, ఎం.రాఘవమ్మ అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,01,116, బంగారు తాపడం పనులకు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
పెనమలూరు: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి అన్నారు. కానూరు రీజనల్ ట్రైనింగ్ సెంటర్‌లో బుధవారం ఎన్టీఆర్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్స్ కమిటీలు, ఈగల్ క్లబ్‌లు, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, శక్తి కమిటీలు చురుకుగా పని చేయాలని సూచించారు. పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. బాల బాలికల హక్కుల సంరక్షణకు సమష్టి కృషి అవసరమన్నారు. అనాథ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకునే బాలలకు పూర్తి వసతులు కల్పించాలని సూచించారు. అనాథ పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాలలో ఉంచా లని వారికి నెలకు రూ.4 వేలు స్కాలర్‌షిప్ అందుతుందన్నారు. డీఈవో యూవీ సుబ్బారావు, సీ్త్ర,శిశు సంక్షేమ సాధికారిత అధికారి షేక్ రుక్సానా సుల్తానాబేగం, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, ఆర్‌ఐవో బి.ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొండలమ్మకు రూ.17.75లక్షల ఆదాయం