
నషా ముక్త్ జిల్లా లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారం దిశగా పయనిస్తూ జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే క్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సెలింగ్ సేవలు తదితరాలపై బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో ఈగల్ క్లబ్స్‌తో పాటు క్యాంపస్ అంబాసిడర్లను కీలకపాత్ర పోషించేలా చూడాలన్నారు. స్వల్ప నిడివితో ఆడియో, వీడియో ప్రదర్శనలు, పీపీటీ ప్రజెంటేషన్, సందేహాల నివృత్తి, ఇంటరాక్షన్ వంటివాటితో అరగంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
ఐదేళ్ల ప్రస్థానం..
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
మాదకద్రవ్యాల వినియోగం అనేది తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోందని.. సమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తోందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2020, ఆగస్టు 15న నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్‌ఎంబీఏ)ను ప్రారంభించారన్నారు. ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీలు, వాకథాన్‌లు, వెబినార్లు, సెమినార్లు, పోటీలు వంటివి నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 13న దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చడానికి శక్తి మేరకు కృషిచేస్తాననే ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమాల వివరాలను ఎన్‌ఎంబీఏ మొబైల్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు.. స్కిల్స్ ముద్దు, ఈగల్ టోల్‌ఫ్రీ నంబరు 1972, ఈగల్ క్లబ్స్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి వాడ్రేవు కామరాజు, ఏసీపీలు కె.వెంకటేశ్వరరావు, కె.లతా కుమారి, ఈగల్ ఎస్‌ఐ ఎం. వీరాంజనేయులు పాల్గొన్నారు.