
పొక్లెయిన్ తగిలి వ్యక్తి దుర్మరణం
కోడూరు: పొక్లెయిన్ ముందు భాగంలోని బకెట్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ చాణిక్య కథనం మేరకు.. మండలంలోని మందపాకల– చింతకోళ్ల గ్రామాల మధ్య రహదారి నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో భాగంగా బుధవారం ఉదయం పొక్లెయిన్‌తో రోడ్డుకు రెండు వైపులా మార్జిన్ పనులు చేస్తున్నారు. మందపాకల గ్రామానికి చెందిన గాదె చలపతిరావు (40) ద్విచక్రవాహనంపై చింతకోళ్ల వైపు ప్రయాణిస్తుండగా పొక్లెయిన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని కదిలించాడు. పొక్లెయిన్ ముందు భాగంలో ఉండే ఐరన్ బకెట్ చలపతిరావు ముఖంపై బలంగా తగలడంతో అతను తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చలపతిరావు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పొక్లెయిన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం చలపతిరావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య గాదె ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. అవనిగడ్డ ప్రభుత్వా స్పత్రి వద్ద చలపతిరావు మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పరిశీలించారు. ప్రమాదం తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.