
ఎన్నికలకు దూరం
సహకార సంఘాలు
పెనుగంచిప్రోలు: వ్యవసాయ రంగం బలోపేతం కోసం సహకార వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి జరుగుతుంది. రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎన్నో సేవలను సహకార పరపతి సంఘాలు అందిస్తున్నాయి. వీటి పాలకవర్గాలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నుకోవాల్సి ఉంది. 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత సహకార సంఘాలకు ఇంత వరకు తిరిగి జరగలేదు. ఈ సంఘాల్లో ప్రశ్నించే పాలకవర్గాలు అందుబాటులో లేకపో వటంతో కొన్ని చోట్ల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మంజూరవని నిధులు
ప్రతి ఐదేళ్లకోసారి సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యేవి. పాలకవర్గాలు లేక పోవటంతో నిధులు మంజూరు కావటం లేదని రైతులు వాపోతున్నారు. నిధులు రాకపోవటంతో పాటు రైతులకు అందించే రుణాల్లో కూడా రాయితీలు అందటం లేదంటున్నారు. ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు, వ్యవసాయ పరికరాలను కూడా సరిగా పొందలేక పోతున్నామని రైతులు అంటున్నారు.
పదవులపై ఆశలు
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతోమంది నాయకులు సహకార సంఘ అధ్యక్ష పదవుల కోసం ఆశగా ఉన్నారు. అధికారుల పాలన పూర్తవటంతో ఎన్నికలు తక్షణం పెట్టక పోయినా నామినేటెడ్ పద్ధతిలో అయినా పదవి దక్కుతుందని భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 131 సహకార సంఘాలకు కేవలం తొమ్మిది కమిటీలకు మాత్రమే కమిటీలను వేశారు. మిగిలిన చోట్ల నాయకుల మధ్య పోటీ, పలు రాజకీయ కారణలతో కమిటీలు వేయలేదనే ప్రచారం జరుగుతోంది. కమిటీలను వేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలతో ప్రక్రియ జరుగుతోందనే ప్రచారం కూడా ఉంది. కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈ సారి కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు కూడా కమిటీల్లో స్థానం కావా లని కోరటం టీడీపీ నాయకులకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
2013లో చివరి సారిగా సహకార సంఘాలకు ఎన్నికలు నామినేటెడ్ పదవులతో సరిపెడుతున్న వైనం ఏడాదిగా పర్సన్ ఇన్‌చార్జీలతోనే పాలన పాలకవర్గాలు లేకపోవటంతో మంజూరవని నిధులు
ఎన్టీఆర్ జిల్లాలో 131 సహకార పరపతి సంఘాలు
ఎన్టీఆర్ జిల్లాలో 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు 12 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవటంతో సహకార వ్యవస్థ లక్ష్యానికి దూరంగా ఉంటోందనే విమర్శలు కూడా ఉన్నాయి. సంఘాలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి త్రీ మెన్ కమిటీలు ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన ఏడాది కాలంగా కమిటీలు వేయకుండా ఉద్యోగులనే అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించింది. వారి సమయం కూడా జూలై 30వ తేదీతో ముగిసింది. అయితే 131 సంఘాల్లో తొమ్మిది సంఘాలకు ఇప్పటికే త్రీ మెన్ కమిటీ సభ్యులను నామినేట్ చేసినట్లు చెబుతున్నారు. గుణదల, ఇబ్రహీంపట్నం, గంగినేని పాలెం, కుంటముక్కల, మర్సుమల్లి, మైలవరం, కూనపురాజుపల్లి, రెడ్డిగూడెం, జి.కొండూరు మినహా మిగిలిన చోట్ల అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జులే కొనసాగనున్నారు.