జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు సరళ యోగా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మనసు, శరీరాన్ని అనుసంధానించి జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యసనానికి రోజులో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా సోమవారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు యోగా స్ట్రీట్ నందు జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల థీమ్ యోగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ నగరపాలకసంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎం, వివిధ శాఖల అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు.
యోగా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం విధులకు ఉపక్రమించే ముందు వీలున్నంత సమయాన్ని యోగాకు కేటాయించాలన్నారు. దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరి ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుందని చెప్పారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్‌లో చాలా సరళమైన ఆసనాలు ఉన్నాయని, వీటిని చాలా తేలిగ్గా సాధన చేయవచ్చన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు యోగా విశిష్టతను వివరించి, ఆయా వర్గాల ప్రజలు జీవితాంతం యోగాసనాలను ఆచరించి ఆనందంగా జీవించేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు. ‘యోగా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి, యోగా చేయండి.. రుగ్మతలకు దూరంగా ఉండండి, భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప దివ్య ఔషధం.. ’ అంటూ పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్, కమిషనర్ పాల్గొని, యోగా ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, ఆయుష్ అధికారులు వి.రాణి, రామత్లేహి, రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ


