హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సీనియర్స్ విభాగం పోటీలను శనివారం రాత్రి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రారంభించారు. సీనియర్స్ విభాగంలో ఆరు జతలు పోటీలో పాల్గొన్నాయని పశు ప్రదర్శన కమిటీ సభ్యులు తెలిపారు. 25 నిమిషాల వ్యవధిలో 1.900 టన్నుల బరువును లాగినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు దుస్తులు, జ్ఞాపికలు అందజేశారు.
నగదు బహుమతుల అందజేత
శుక్రవారం రాత్రి జరిగిన జూనియర్ కేటగిరీ పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం అతోటి శిరీష చౌదరి ఎడ్ల జత 20 నిమిషాల వ్యవధిలో 3,504.09 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌కు చెందిన రోహన్‌బాబు ఎడ్ల జత 3,451 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా పర్చూరు మండలం చిన్న నందిపాడు గ్రామానికి చెందిన ఆలా మోహన్‌రావు, పల్నాడు జిల్లా అమరావతి మండలం జీడుగు గ్రామానికి చెందిన ఎడ్ల జత 2,770.10 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నాందేడ్లవారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల సురేష్‌బాబు ఎడ్ల జత 2,760.04 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెద్దపులిపాక గ్రామానికి చెందిన గరికపాటి శ్రీధర్ ఎడ్ల జత 2,250 అడుగుల దూరం లాగి ఐదో స్థానం, గుంటూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి ఆంజనేయులు ఎడ్ల జత 2,000 అడుగుల దూరం లాగి ఆరో స్థానంలో నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు వరుసగా రూ.70 వేలు, రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.


