ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
మల్టీ క్రాప్‌తో బహుళ ప్రయోజనాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర పొందేలా బహుళ పంటల(మల్టీక్రాప్)ను చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. టమాట, మిర్చి పంటల రైతులకు సాగులో శాసీ్త్రయ విధానం, ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను సాధించి ఆర్థిక పురోగతిని సాధించేలా మేధోమథన సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయ ఆవరణంలోని రైతు శిక్షణ కేంద్రంలో ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తలు ఎగుమతి దారులతో నిర్వహించిన మేధోమథన సదస్సుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటలను కాకుండా బహుళ పంటలు (మల్టీక్రాప్)ను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
సవాళ్లను అధిగమించాలి..
రాష్ట్ర ఉద్యాన, పట్టుపురుగుల పెంపక శాఖ డైరెక్టర్ డా. కె. శ్రీనివాసులు మాట్లాడుతూ మిర్చి పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. మన రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 6 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం నిర్వహిస్తున్నారన్నారు. సదస్సులో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకులు విజయ సునీత, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు వెంకటేశ్వర్లు, డాక్టర్ అశోక్ కుమార్, హరినాథ్‌రెడ్డి, ఐసీఎంఆర్ డైరెక్టర్ ఎం. శేషుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.


