ఆపరేషన్ సిందూర్‌కి సంఘీభావం
నాగాయలంక: పాకిస్తాన్ భూ భాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి విజయవంతంగా దాడి జరిపి, ఉగ్రవాదుల పీచమణిచిన భారతీయ సైనిక దళాలకు వందనం చేస్తూ నాగాయలంకలో బుధవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుదర్శి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 60అడుగుల భారీ జాతీయ పతాకం చేతబూనిన వివిధ వర్గాల ప్రజలు, సంస్థల ప్రతినిధులతో మానవహారం నిర్మించి.. జైహింద్ నినాదాలతో జేజేలు పలికారు. సంస్థ నిర్వాహకులు తలశిల రఘుశేఖర్, కనిగంటి నారాయణ పర్యవేక్షణలో తొలుత ప్రధాన మార్గంలో ర్యాలీగా ట్రాఫిక్ ఐలెండ్ కూడలికి చేరుకుని అక్కడ మానవహారం నిర్మించారు. డీసీ మాజీ చైర్మన్ బీసాబత్తిని ప్రసాద్, చన్నగిరి లతామోహన్, అమ్మారావు పాల్గొన్నారు.


