నత్తనడకన ఆధునికీకరణ
గత ఏడాది రూ.43.25 కోట్లు మంజూరైనా జరిగిన పనులు శూన్యం ఇప్పటికీ సగానికి పైగా పనులకు టెండర్లు కూడా పిలవని అధికారులు విజయవాడ నగరంలో ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోని ప్రభుత్వం
బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపని ప్రభుత్వం
అమలుకు నోచని బుడమేరు యాక్షన్ ప్లాన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ దుఃఖదాయనిగా మారిన బుడమేరు ఆధునికీకరణ నత్తనడకన సాగుతోంది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపని చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతోంది. ఈ నేపథ్యంలో వర్షం అంటేనే బుడమేరు ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బుడమేరుకు వచ్చిన భారీ వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లో బసచేశారు. బెజవాడ ముంపు నివారణ కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తానని హడావిడి చేశారు. అనంతరం బుడ మేరు ఆధునికీకరణకు నిధుల కేటాయింపులో మాత్రం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మొదటి దశలో బుడమేరు ప్రక్షాళనకు రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. కేవలం రెగ్యులేటర్ గేట్ల మరమ్మతులతో సరిపెట్టారు. గత ఏడాది కంటి తుడుపుగా బుడమేరు గండ్లు పూడ్చివేతకు రూ.43.25 కోట్లు మంజూరు చేశారు. కేవలం 18 పనులకు సంబంధించి ఆగస్టులో రూ.20 కోట్ల పనులకు మాత్రమే టెండర్లు పిలిచారు. ఇందులో మైలవరం ప్రజాప్రతినిధికి ముందుగానే ముడుపులు మట్టజెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు టెండర్లు పిలవక ముందే కొన్ని పనులు చేశారు. టెండర్లు పిలిచాక వారికే కాంట్రాక్టు దక్కేలా పావులు కదిపారు. టెండర్లు పిలకవ ముందు జరిగిన పనులు మినహా మిగిలినవన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం.
బుడమేరు వరద ముంపు నివారణ కోసం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మొదటి నుంచీ అలసత్వం ప్రదర్శిస్తోంది. 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు బెజవాడ మునిగింది. పది రోజులకు పైగా వరద ముంపులో చిక్కుకొని ప్రజలు విలవిల్లాడారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఆ పరిస్థితుల నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. వరద సమయంలో హడావిడి తప్ప, తరువాత దాని గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చేలోపు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి పూర్తిచే యకపోతే ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్లుగా నగరంతోపాటు, బుడమేరు పరీవాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసిన ప్రతిసారీ ప్రజలు హడలిపోయారు. కొత్త సంవత్సరంలో అయినా బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపాలని విజయవాడ వాసులు కోరుకుంటున్నారు.
విజయవాడ నగర ప్రజలను ముంపు నుంచి రక్షించాలనే లక్ష్యంగా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. నగరాన్ని ముంపు రహితంగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు హడావిడి చేశారు. ప్రాథమికంగా మొదటి దశలో బెజవాడలో బుడమేరు కాలువ సామర్థ్యాన్ని ఐదువేల నుంచి పది వేల క్యూసెక్కులకు పెంచా లని ప్రతిపాదించారు. ఇందుకు రూ.500 కోట్ల ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే నిధులు మాత్రమే విడుదల చేయలేదు. 13.25 కిలో మీటర్లు పొడవునా బుడమేరు ఆక్రమణలకు గుర్తెంది. విద్యాధరపురం నుంచి గుణదల వరకు నగరపాలక సంస్థ పరిధిలో 202 ఎకరాలకు 70 ఎకరాల మేర ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విస్తీ ర్ణంలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటిని సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించేలా ప్రణాళిక రచించారు. దీంతో పాటు చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు యూటీల సామర్థ్యం పెంచాల్సి ఉంటుందని భావించారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల మేర కాలువ గట్లను మరింత బలోపేతం చేయాల్సింది. ప్రస్తుతం ఈ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం ఎటు వంటి చర్యలూ తీసుకోలేదు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు బుడమేరులో నామమాత్రంగా పూడిక తీసి చేతులు దులుపుకొంటున్నారు.
నత్తనడకన ఆధునికీకరణ


