బోరుమంటున్న కృష్ణా తీరం
బెజవాడలో పాతాళంలోకి గంగ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో లేవు. గతేడాది మార్చితో పోలిస్తే చాలా ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం పడిపోయింది. ముఖ్యంగా విజయవాడ ‘బోరు’న విలపిస్తోంది. వాస్తవానికి నగరానికి ఓ వైపు కృష్ణా నది ప్రవహిస్తోంది. అంతేకాక మూడు ప్రధాన కాలువలు, నగరం మధ్య నుంచి బుడమేరు ప్రవహిస్తున్నాయి. అయినప్పటికీ విజయవాడతో పాటు చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో వేసిన బోర్లు నిలువునా ఎండిపోతున్నాయి. మెట్ట ప్రాంతాల్లోనూ భూ గర్భ జల మట్టం పడిపోయింది. నగరంలో లక్షలాది రూపాయలు వెచ్చించి బోర్లు వేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. రోజు రోజుకు విస్తరిస్తున్న నగర పరిసరాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.
మిగిలిన ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి..
● జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో భూగర్భ జలవనరుల శాఖ 70 ఫిజో మీటర్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా భూ గర్భ జలమట్టం లెక్కలు తీస్తోంది.
● ఏటా రుతు పవనాలకు ముందు, తర్వాత జలమట్టం కొలుస్తారు.
● తాజా లెక్కల ప్రకారం ఏ కొండూరు మండలం కొత్త రేపూడి గ్రామంలో భూ గర్భ జలమట్టం గణనీయంగా తగ్గింది. గతేడాది మార్చినెలతో పోలిస్తే 6.33 మీటర్లు ఉన్న జలమట్టం 14 మీటర్లకు పడిపోయింది.
● కంభంపాడులోనూ నీటి మట్టం తగ్గింది. జిల్లాలోని చందర్లపాడు మండలంలోని చింతలపాడు, కాసరబాద గ్రామాల్లోనే నీటి మట్టం తగ్గింది. ఈ రెండు గ్రామాలు కృష్ణానది చెంతనే ఉన్నాయి.
● జి. కొండూరు మండలం కోడూరు, కుంటముక్కల, వెలగలేరు గ్రామాల్లో నీటి మట్టం తగ్గింది.
● గంపలగూడెం మండలం గంపలగూడెం, వినగడప గ్రామాల్లోనూ, ఇబ్రహీం పట్నం మండలం జూపూడి, కొండపల్లి, కంచికచర్ల మండలం కంచికచర్ల, పరిటాల, పెండ్యాల, మైలవరం మండలం చంద్రాల, వత్సవాయి మండలం పోలంపల్లి, తాళ్లూరు, వత్సవాయి, విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామాల్లో నీటి మట్టం పడిపోయింది.
● బుడమేరు వరదల్లో విజయవాడలో సగభాగం సుమారు 10 రోజులపాటు వరద నీటిలో ఉంది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో నీటి మట్టం పెరగలేదు.
డ్రాట్ ఇండెక్స్‌లో మూడు మండలాలు..
తాజా అంచనాల ప్రకారం ప్రకారం జిల్లాలోని మూడు మండలాలు కరువు ఇండెక్స్‌లో వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఏ. కొండూరు, విజయవాడ రూరల్ మండలాలు మైల్డ్ డ్రాట్, కంచికచర్ల మండలం మోడరేట్ డ్రాట్ కండిషన్‌లో ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా నిరాశాజనకంగా భూగర్భ జలం
గతేడాదితో పోలిస్తే చాలా చోట్ల
పడిపోయిన జలమట్టం
విజయవాడ పశ్చిమం, రూరల్
ప్రాంతాల్లో ఎండిపోతున్న బోర్లు
500 అడుగుల వరకు వెళితే గానీ నీరు పడని పరిస్థితి
మే నెలలో మరింత సంక్లిష్టంగా మారే అవకాశం
500 అడుగుల వరకు వెళ్లాల్సిందే..
గొల్లపూడితోపాటు విజయవాడ పశ్చిమ ప్రాంతం, అజిత్‌సింగ్‌నగర్ పరిసర ప్రాంతా ల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేసేవారు 500 అడుగుల వరకు బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో 15 ఏళ్ల కిందట వేసిన బోర్లు ఎండిపోయి నీటి సమస్య ఎదురవుతోంది.
వేసవిలో స్వల్ప వ్యత్యాసాలు..
జిల్లాలో 70 ఫిజోమీటర్లు ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు భూ గర్భ జల మట్టం కొలతలు తీస్తున్నాం. నగరంలో బోర్లకు నీరు అందడం లేదని మా దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల 300 అడుగులు వేసినా పడని పరిస్థితి. ఇకపై భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు 500 అడుగుల వరకు బోర్లు వేస్తే నీటికి ఇబ్బంది ఉండదు.
– నాగరాజు,
డీడీ, భూగర్భ జలవనరుల శాఖ


