ప్రధాని మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
విజయవాడస్పోర్ట్స్: రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే రెండో తేదీన వస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కేజీవీ సరిత తెలిపారు. ప్రధాని పర్యటన నిమిత్తం ఏర్పాటు చేయవలసిన బందోబస్తుపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ నగరం మీదుగా ప్రయాణిస్తారని చెప్పారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమానికి విచ్చేసే ప్రముఖులు, ప్రజలు ప్రయాణించు అన్ని రూట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బందోబస్తు ఏర్పాట్లలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా, భద్రతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీపీలు ఏబీటీఎస్ ఉదయారాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్వీడీ ప్రసాద్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఏం.రాజారావు, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.


