హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

Apr 26 2025 1:11 AM | Updated on Apr 26 2025 1:11 AM

హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

పెనమలూరు: యనమలకుదురు గ్రామ పరిధి కృష్ణానది లంకల్లో ఈ నెల 4వ తేదీన హత్యకు గురైన పోతుల పోచమ్మ(67) కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ కె.గంగాధరరావు తెలిపారు. ఆయన శుక్రవారం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించారు. యనమలకుదురు లంకల్లో హత్య జరిగిన తర్వాత పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారన్నారు. సాంకేతికతఆధారంగా మృతురాలు తెలంగాణ మెదక్‌ జిల్లా గణ్‌పూర్‌ మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందినవాసిగా గుర్తించారు.

డబుల్‌ మర్డర్‌ కేసు

పెనమలూరు ఎస్‌ఐ రమేష్‌, పోలీసులు గంగాపూర్‌ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేయగా డబుల్‌ మర్డర్‌ కేసు వెలుగు చూసిందన్నారు. మృతురాలు పోతుల పోచమ్మకు కుమారుడు పోతుల మహేష్‌ ఉన్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి స్థానికంగా ఉన్న బండి శోభ(42)తో వివాహేతర సంబంధం ఉంది. భర్తను వదిలేసిన ఆమె అదే గ్రామానికి చెందిన మామిడి గోపాల్‌తో(45) కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఆమె గతంలో మహేష్‌ వద్ద 9 గ్రాముల బంగారు గొలుసు తీసుకొని తాకట్టు పెట్టింది. విషయం తెలిసిన పోచమ్మ ఆమెను గొలుసు ఇవ్వాలని ఒత్తిడి చేయసాగింది. మహేష్‌ కూడా తన గొలుసు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేశాడు.

హత్యకు ప్లాన్‌

మామిడి గోపాల్‌, ఆ మహిళకు ఇబ్బందిగా మారిన మహేష్‌ను హత్య చేయడానికి ప్రణాళిక రచించారు. ప్రధానంగా గోపాల్‌.. ఆమెతో మహేష్‌కు ఉన్న వివాహేతర సంబంధంపై రగిలిపోతున్నాడు. దీంతో ఈ ఏడాది మార్చి 26న మహేష్‌ను నమ్మించి గోపాల్‌, ఆ మహిళ అతన్ని మెదక్‌ జిల్లా ఏడుపాయల వంతెన వద్దకు తీసుకెళ్లారు. ఊరు చివర వాగు వద్ద రాయిపై కూర్చొని కల్లు తాగారు. మహేష్‌ మత్తులో ఉండగా రాయిపై నుంచి కిందకు తోసివేశారు. గాయపడిన మహేష్‌ను తుండుతో మెడకు బిగించి హత్య చేశారు.

ఆంధ్రలో పోచమ్మ హత్యకు స్కెచ్‌

పోచమ్మ తన కుమారుడు కనపడటం లేదని, ఏమి చేశారని తరచుగా గోపాల్‌, ఆ మహిళను ప్రశ్నిస్తుండటంతో ఆమెను హత్య చేయడానికి పథకం పన్నారు. మహేష్‌ యనమలకుదురులో పని చేస్తున్నాడని నమ్మించి పోచమ్మను ఆంధ్రలో హత్య చేయడానికి స్కెచ్‌ వేశారు. 3వ తేదీన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి పోచమ్మను ఈ నెల 4వ తేదీన యనమలకుదురుకు తీసుకు వచ్చారు. గోపాల్‌ యనమలకుదురులో మద్యం కొన్నాడు. మహేష్‌ నదిలో ఇసుక పనులు చేస్తున్నాడని నమ్మించి పోచమ్మను నదిలోకి తీసుకెళ్లారు. వారితో తీసుకొచ్చిన కల్లులో లోబీపీ బిళ్లలు కలిపి పోచమ్మతో తాగించారు. గోపాల్‌, ఆ మహిళ కూడా మద్యం సేవించారు. పోచమ్మ స్పృ హ కోల్పోయిన తర్వాత చీరకొంగుతో మెడకు బిగించి హత్య చేసి చెవి దిద్దులు తీసుకొని గుట్టుచప్పుడవ్వకుండా రైలు ఎక్కి గోపాల్‌, ఆ మహిళ వెళ్లి పోయారు.

గోపాల్‌కు యనమలకుదురులో లింకులు

గోపాల్‌ బావ యనమలకుదురులో ఉండటంతో గోపాల్‌, ఆ మహిళ గతంలో పలుసార్లు యనమలకుదురుకు వచ్చి వెళ్లారు. హత్యకు ఈ ప్రాంతం అనువుగా ఉందని పోచెమ్మను కృష్ణా నదిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకు వెళ్లి హత్య చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీలు, ఇతర టెక్నికల్‌ ఎవిడెన్స్‌ల ఆధారంగా డబుల్‌ మర్డర్‌ కేసును ఛేదించారని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రమేష్‌ను శాలువా కప్పి ఎస్పీ గంగాధరరావు సన్మానించారు. సిబ్బందిని ప్రశంసించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్‌ శ్రీనివాసరావు, సీఐ జె.వెంకటరమణ, ఎస్‌.రమేష్‌, నాలుగు బృందాలుగా సిబ్బంది పాల్గొన్నారు.

యనమలకుదురు లంకల్లో ఈ నెల 4న వృద్ధురాలి హత్య వివరాలు వెల్లడించిన ఎస్పీ గంగాధరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement