ఉగ్రదాడికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయవాడ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిరసన ప్రదర్శన జరిగింది. సిద్ధార్థ కళాశాల దగ్గర నుంచి మొదలైన నిరసన ప్రదర్శన మదర్‌ధెరిస్సా జంక్షన్, సిద్దార్థ స్కూల్ రోడ్డు, ఆర్‌ఆర్ జంక్షన్, జమ్మిచెట్టు సెంటర్, శిఖామణి సెంటర్ మీదుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి మాట్లాడుతూ ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమఅన్నారు. పహల్గాం ఘటనను ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని అణిచివేతకు కేంద్రానికి అందరూ సహకరించాలని కోరారు. పరిషత్ రాష్ట్ర కార్య సమితి సభ్యులు దుర్గారావు, అఖిల్, ఖాసీం, శ్యామ్, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


