ప్రమాద బాధితులకు పరిహారం అందజేత
విజయవాడస్పోర్ట్స్: రోడ్డు ప్రమాదం(హిట్ అండ్ రన్) కేసుల్లో బాధితులకు కేంద్రప్రభుత్వం ఆర్ధిక సాయం మంజూరు చేసిందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. జిల్లాలోని 101మంది బాధితులకు కేంద్రం నుంచి రూ.89.5లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం ఆయన ప్రమాద బాధిత కుటుంబసభ్యులకు నగదు చెక్కులను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ బాధితులకు నష్టపరిహారం అందించడంలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా 253 ప్రమాదాలు చోటుచేసుకోగా, ఇప్పటివరకు 101 కుటుంబాలకు నష్టపరిహారం అందించామన్నారు. కేంద్రప్రభుత్వం రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడిన వ్యక్తికి రూ.50వేలు మంజూరు చేస్తుందన్నారు. తాజాగా 26కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, 75కుటుంబాలకు రూ.50వేల చొప్పున మంజూరుకావడంతో బాధితులకు అందించినట్లు వివరించారు. మిగిలినవారికి కూడా త్వరలోనే పరిహారం అందేలా చూస్తామన్నారు. గుర్తుతెలియని వాహనాలు చేసిన రోడ్డు ప్రమాదం(హిట్ అండ్ రన్) కేసులను చేధింపు, కేంద్రం నుంచి నష్టపరిహారం మంజూరుకు కావాల్సిన పత్రాలను సేకరించేందుకు డెఫ్యూటీ పోలీస్ కమిషనర్(డీసీపీ) కృష్ణమూర్తినాయుడు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సురక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3000 సీసీ కెమెరాలను చేసినట్లు చెప్పారు. హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని కచ్చితంగా స్వాధీనం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కేంద్రం నుంచి నష్టపరిహారం అందేలా కీలకంగా వ్యవహరించిన డీసీపీ కృష్ణమూర్తినాయుడు, డెప్యూటీ కలెక్టర్ జి.మహేశ్వరరావు, రాష్ట్ర జనరల్ ఇన్సూరెన్స్ అధికారి డి.రామ్‌సుధాకర్, ఏసీపీ రామచంద్రరావు, మహిళా ఎస్‌ఐ మల్లీశ్వరి, కలెక్టరేట్, పోలీస్‌శాఖ సిబ్బందిని కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో డీసీపీలు కె.జి.వి.సరిత, జి.గుణ్ణం రామకృష్ణ పాల్గొన్నారు.


