
కేబుల్ వైర్ల దొంగలు అరెస్టు
తోట్లవల్లూరు: పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు కత్తిరించే దొంగలను పోలీసులు పట్టుకున్నారు. రైతులకు గత కొంతకాలంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చోరులు ఎట్టకేలకు దొరికారు. మండలంలోని బొడ్డపాడు–చినపులిపాక మార్గంలో కల్వర్టు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కేబుల్ వైర్ల చోరీ వెలుగు చూసింది. ఎస్‌ఐ సీహెచ్ అవినాష్ తెలిపిన వివరాల ప్రకారం..గన్నవరం మండలం బుద్దవరానికి చెందిన చలందార్ల స్వామి, ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన చలమచర్ల మహేశ్వరరావు అలియాస్ మహేష్, అదే గ్రామానికి చెందిన మరో 17 ఏళ్ల బాలుడు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తమకు అవసరమైన డబ్బును సంపాదించే క్రమంలో మండల పరిధిలోని లంక ప్రాంతాల్లో గల పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లకు చెందిన కేబుల్ వైర్లను తస్కరించడం మొదలుపెట్టారు. చోరీ చేసిన వైర్లను కాల్చి దానిలోని రాగితీగను అమ్ముకోవటానికి తీసుకెళుతూ పట్టుబడినట్లు ఎస్‌ఐ చెప్పారు. నిందితుల నుంచి తొమ్మిది కేజీల రాగి వైరు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోండి
– డీఎస్‌డీవో అజీజ్
విజయవాడస్పోర్ట్స్:ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యాన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు జరిగే వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆసక్తి ఉన్న క్రీడా సంఘాలు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఎస్‌డీవో ఎస్.ఎ.అజీజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని క్రీడాంశాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. శాప్ ఆదేశాల మేరకు ఒక్కో క్రీడాంశంలో ఎనిమిది నుంచి 14 సంవత్సరాల లోపు వయసున్న 25 మంది బాలురు, 25 మంది బాలికలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఇందిరాగాంధీ స్టేడియంలోని తమ కార్యాలయంలో పూర్తి చేసిన దరఖాస్తులను అందజేయాలని సూచించారు.