ఆరుగురు ‘గంజాయి’ నిందితుల అరెస్ట్
కంకిపాడు: గంజాయి తాగుతూ, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులను కంకిపాడు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ స్థానిక పీఎస్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సోమవారం కంకిపాడు పీఎస్ పరిధిలోని ప్రొద్దుటూరు శివారు గాయత్రీ విహార్‌లోని ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేశారు. 18–25 ఏళ్ల యువకులు పోలీసుల రాకను గుర్తించి పారిపోయేందుకు ప్రయత్నించారు. వీరిలో ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.200 కిలోలు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీ అయ్యారు. పట్టుబడ్డ ఆరుగురిలో గోసాలకు చెందిన షేక్‌కాలేష, విజయవాడ కృష్ణలంకకు చెందిన గండ్ర వెంకట దినేష్‌కుమార్, ఈడుపుగల్లు గ్రామానికి చెందిన గూడవల్లి షాలేమ్‌రాజు, గండ్రపు కుమార్, ప్రొద్దుటూరుకు చెందిన కొనళ్ల కిరీటి, మరో మైనరు ఉన్నారు. పరారీలో ఉన్న యువకులు కోసం గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ మురళీకృష్ణ సూచించారు.
21 కిలోల గంజాయి స్వాధీనం
మధురానగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ముగ్గురిని గుణదల పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుణదల రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అమ్మడం జరుగుతుందని ఆదివారం గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనుకి కచ్చితమైన సమాచారం అందింది. ఆయన, సిబ్బంది కలిసి గుణదల రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూసి ముగ్గురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విచారణలో ఒకరు భవానీపురానికి చెందిన గుంటూరు ప్రవీణ్, మరొకరు క్రీస్తురాజపురానికి చెందిన గొల్ల ప్రభుకుమార్, మూడో వ్యక్తి లబ్బీపేటకు చెందిన కస్తూరి సాయి తేజగా గుర్తించారు. వీరిపై వివిధ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. 21 కేజీలు గంజాయిని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సోమవారం రిమాండ్‌కు పంపించగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తూ జైలుకు పంపించారు.


