విత్తు నుంచి విక్రయం వరకూ అన్నీ కష్టాలే
ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాత విలవిల యూరియా దొరకక ఇబ్బందులు పంటలకు లభించని కనీస మద్దతు ధర అన్ని పంటలదీ అదే దారి కరువైన సర్కారు భరోసా తీవ్ర సంక్షోభంలో అన్నదాతలు
మిర్చికి తెగుళ్ల ముప్పు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పెనుగంచిప్రోలు: అన్నదాతను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది తుపానులు, అధిక వర్షాల, తెగుళ్ల ప్రభావం తీవ్రంగా పడింది. గణనీయంగా పంట దిగుబడులు తగ్గాయి. అరకొరగా పండిన పంటలకు కనీస మద్దతు ధర లభించక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి పండుగ నాటికి ధాన్యం ఇంటికి చేరి రైతులు ఆనందంతో ఉంటారు. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితులు లేవు. రైతన్నల ఇంట సంకాంత్రి కాంతులు కనిపించటం లేదు.
అన్ని పంటలూ నష్టాల పాలే..
మోంథా తుపాను ప్రభావంతో రైతులు చిత్తయ్యారు. పత్తి పంటకు సంబంధించి ఎకరాకు ఈ ఏడాది 4–5 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చింది. కనీస మద్దతు ధర క్వింటా రూ. 8,110కాగా, నామ మాత్రంగానే కొనుగోలు చేశారు. దీంతో రైతులు క్వింటాకు రూ.4500–రూ.5,000లకే అమ్ముకోవాల్సి వచ్చింది. వరి పంటకు సంబంధించి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో సైతం దళారులు కోత విధించారు. పెసల కనీస మద్దతు ధర రూ.8,768 కాగా ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు క్వింటా రూ.5వేలకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. మార్కెట్‌లో మినుముల ధర క్వింటా రూ.6వేలకు కూడా అడగని పరిస్థితులు ఉన్నాయి. కంది ధరలు నేల చూపు చూస్తున్నాయి. మొక్క జొన్న కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400కాగా, ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయక పోవడంతో బయట మార్కెట్‌లో రూ.1800కు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు యూరియా దొరకక రైతులు తిప్పలు పడుతున్నారు. రాత్రిం పగళ్లు పడి గాపులు కాసి, బ్లాక్ మార్కెట్‌లో యూరియా కొనాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
తగ్గనున్న దిగుబడులు..
తెగుళ్ల కారణంగా మిర్చి పంట దిగుబడులు కూడా దారుణంగా తగ్గనున్నాయి. సాధారణంగా ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరానికి 10 క్వింటాళ్ల లోపే వస్తుందని రైతులు అంటున్నారు. పంట విస్తీర్ణం తగ్గినా, దిగుబడులు లేక, గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వంలో క్వింటా మిర్చి ధర రూ.23వేల వరకు ఉంటే ప్రస్తుతం క్వింటా రూ.14వేల లోపే ఉండటంతో పెట్టుబడులు కూడా రావని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత రెండేళ్లుగా తీవ్ర నష్టాలను చవిచూసిన మిర్చి రైతులకు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. మిర్చి పంటకు ఈ ఏడాది పూత, పిందె దశలోనే తామర పురుగుతో పాటు పలు రకాల తెగుళ్లు వ్యాపించాయి. కొన్నిచోట్ల అయితే పంట నిలువునా ఎండిపోతుండటంతో రైతులు వేదన చెందుతున్నారు. తెగుళ్ల నివారణకు సస్య రక్షణ చర్యలు చేపట్టినా తగ్గటం లేదు. ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లాలో 9 వేల హెక్టార్ల వరకు మిర్చి సాగు చేశారు. ఎక్కువగా తేజ సన్న రకాలనే సాగు చేశారు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ఆశాజనకంగా ఉందనుకున్న తరుణంలో తామర పురుగు ఉద్ధృతితో పాటు నల్లి ఆశించింది. గత 15 రోజుల నుంచి తెగుళ్ల ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తోంది. తామర పురుగు ఆకు, కాయలపై రసాన్ని పీల్చేస్తోంది. దీంతో మిర్చి మొక్కలు ఎర్రబడి వడబడి ఎండిపోతుండటంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. వీటి నివారణకు మందులు స్ప్రే చేసినా తగ్గుముఖం పట్టటం లేదని రైతులు వాపోతున్నారు.
విత్తు నుంచి విక్రయం వరకూ అన్నీ కష్టాలే


