షోకాజ్ నోటీసులు, అంతర్గత బదిలీలు
అభిషేక పాలలో పురుగుల ఘటనపై దుర్గగుడి ఈఓ చర్యలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేకానికి వినియోగించే పాలలో పురుగులు ఉన్న ఘటనపై విచారణ కమిటీ నివేదిక అందజేసింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏఈఓలు, వైదిక కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆలయ ఈఓ సంబంధిత అధికారులు, అర్చకులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. శ్రీచక్ర పూజ నిర్వహించే డీఎస్‌ఎస్ సుబ్రహ్మణ్యశర్మపై అభియోగాలు నమోదు చేస్తూ ఆయనను విధుల నుంచి తప్పించారు. ప్రత్యామ్నాయంగా నిత్యం సాయంత్రం వేళ జరిగే దర్బార్ సేవ, పల్లకీ సేవలతో పాటు లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ అప్పగించారు. లక్ష కుంకుమార్చన నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏవీఎస్ రవితేజకు శ్రీచక్రనవార్చన నిర్వహణ అప్పగించారు. ఇక శ్రీచక్రపూజ పరిచారక తంగిరాల సత్యనారాయణ శర్మ, స్టోర్స్ విభాగం సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, పూజల విభాగం నిర్వహణ విధులు నిర్వర్తించే ఎన్‌ఎంఆర్ సీహెచ్ శైలజ విధులను మార్చుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. పూజా కార్యక్రమాల నిర్వహణలో సమన్వయ లోపం పర్యవేక్షణ లేకపోవడంతో ఏఈవో వెంకటరెడ్డి, సూపరిండెంటెంట్ పి. సునీత, జూనియర్ అసిస్టెంట్ టి. సుబ్రహ్మణ్యం, ఎన్‌ఎంఆర్ శైలజకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు 7 రోజులలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక ప్రోవిజన్ స్టోర్స్ సూపరిండెంటెంట్ బి. కల్యాణి, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్యలను విధుల నుంచి రిలీవ్ చేస్తూ పరిపాలనా విభాగానికి సరెండర్ చేశారు. అదే విధంగా సీసీ ఫుటేజీని సకాలంలో అందజేయని కారణం చూపుతూ ఈఈ కోటేశ్వరరావుకు షోకాజ్ నోటీసును జారీ చేశారు.
ఆవు పాలనే వినియోగించాలని నిర్ణయం
దుర్గగుడిలో జరిగే పూజలు, అభిషేకాలలో ఇకపై గోవుల నుంచి సేకరించిన పాలనే వినియోగించాలని దేవస్థాన అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆలయంలో ఉండాల్సిన గోవులను పోరంకికి తరలించడంపై ‘సాక్షి’ దిన పత్రిక సోమవారం ప్రచురించిన కథనానికి సైతం అధికారులు స్పందించారు. ఒకటి, రెండు రోజుల్లోనే పోరంకిలోని గోవులను ఇంద్రకీలాద్రికి తరలించేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై దేవస్థానంలో టెట్రాప్యాకెట్లు వినియోగించరాదని దేవస్థాన వైదిక కమిటీ తీర్మానించింది.


