మురిసిన పుస్తకం.. ముగిసిన మహోత్సవం
చివరి రోజు భారీగా తరలివచ్చిన సందర్శకులు వివిధ పోటీల్లో విజేతలకు బహుమతలు ప్రదానం మొత్తంగా ఆరు లక్షల మంది వచ్చారన్న నిర్వాహకులు
ఆరు లక్షల మంది..
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పుస్తక ప్రియులను, సందర్శకులను కట్టిపడేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం సోమవారం ముగిసింది. చివరిరోజు కూడా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం సందర్శకులతో కిక్కిరిసింది. కాగా ముగింపు సభకు మంత్రి రవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన చిన్నతనంలో చందమామ కథలు పుస్తకాలు వచ్చేవని, ప్రతి పుస్తకంలో ఒక నీతి కథ ఉండేదని పేర్కొన్నారు. అలాంటి పుస్తకాలు చదవడం ద్వారా చిన్నతనం నుంచే నైతిక విలువలు పెంపొందుతాయన్నారు. ప్రస్తుతం అలాంటి పుస్తకాలు ప్రచురితం కావడం లేదన్నారు. పిల్లలకు నచ్చిన పుస్తకాలు ఇచ్చి వారిని చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. విజయవాడకు పుస్తకాలకు విడదీయరాని బంధం ఉందన్నారు. వేదాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను తాళపత్రాలపై రాశారని, కాలక్రమంలో వాటిని పుస్తక రూపంలో తీసుకువచ్చారని, అవే ఇప్పుడు మన సంస్కృతిని కాపాడుతున్నాయని వివరించారు. తాను అనే క సందర్భాల్లో తన మిత్రుడు ఇచ్చిన పుస్తకం చదవి స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు.
తరచూ నిర్వహించాలి..
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. నగరంలో ఏర్పాటు చేసిన ఈ పుస్తక మహోత్సవాన్ని వివిధ ప్రాంతాల్లో తరచూ నిర్వహించాలన్నారు. గతంలో పుస్తకాల కోసం ప్రత్యేకంగా ఒక గది ఉండేదని, పుస్తకాలు లేని ఇంటిని ఆత్మ లేని శరీరం వంటిదని చెప్పావారన్నారు. జ్ఞానం అంతా పుస్తకాల్లోనే ఉంటుందన్నారు. ఈ నాలెడ్జ్‌ను ఏదో ఒక రూపంలో పొందుపరిచి తర్వాత తరాలకు అందజేయాలన్నారు. రచయిత అనే వారు ఎల్లప్పుడు పుస్తకాలు రాస్తూనే ఉండాలన్నారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్‌ప్రభావాల గురించి వివరించారు. డ్రగ్స్ గురించి ఏ సమాచారం తెలిసినా 1972కు సమాచారాన్ని అందజేయాలన్నారు.
పుస్తక మహోత్సవం అధ్యక్షుడు మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ఈ 36వ పుస్తక మహోత్సవాన్ని ఆరు లక్షల మంది పాఠకులు సందర్శించారని, సుమారు రూ.8కోట్ల విలు వైన పుస్తకాల విక్రయాలు జరిగాయని చెప్పారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ అధికార భాషాసంఘం అధ్యక్షుడు త్రివిక్రమరావు, రాష్ట్ర పౌర గ్రంథాలయ సంస్థ సంచాలకుడు కృష్ణమోహన్, ముంజులూరి కృష్ణకుమారి, సాహిత్య విమర్శకురాలు బాలాంత్రపు నాగ ప్రసూన, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు.


