సేవల పంపిణీ వేగవంతం
కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ప్రభుత్వ సేవల పంపిణీలో వేగాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు వర్చువల్‌గా హాజరయ్యారు. జీఎస్‌డీపీ, కీలక ప్రగతి సూచికలు (కేపీఐ), స్వర్ణాంధ్ర విజన్ – పది సూత్రాలు, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, పీపీపీ ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రతిపాదనలు, రియల్‌టైమ్ గవర్నెన్స్, రెవెన్యూ సేవలు, వీబీ– జీ రామ్ జీ యాక్ట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించి.. ఆయా అంశాల్లో ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుతో పాటు అన్ని రంగాల్లోనూ 18 శాతం సుస్థిర వృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కీలక ప్రగతి సూచికల్లో జిల్లా ముందంజలో ఉందని, పేదరిక నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాల అమల్లో సమష్టి కృషితో పని చేస్తున్నామన్నారు.


