అర్జీదారుల సంతృప్తే లక్ష్యం
జాయింట్ కలెక్టర్ ఇలక్కియ జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో 85 అర్జీలు స్వీకరణ రెవెన్యూ క్లినిక్‌కు 88 అర్జీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి, నిబద్ధతతో, నాణ్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్, మరో సమావేశ మందిరంలో నాన్ రెవెన్యూ పీజీఆర్‌ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
సమన్వయం చేసుకోండి..
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 85 రెవెన్యూ యేతర అర్జీలురాగా వీటిలో పోలీసు శాఖకు 19, పురపాలన 15, పంచాయతీరాజ్ 10, డీఆర్‌డీఏ 8, వైద్య ఆరోగ్యం 5, పౌర సరఫరాల శాఖకు 4 అర్జీలు వచ్చాయి. అదేవిధంగా విద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌కు మూడు చొప్పున, రహదారులు–భవనాలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఇరిగేషన్, రవాణా, డ్వామాలకు రెండు చొప్పున అర్జీలు అందాయి. కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్‌కు 88 అర్జీలు వచ్చాయి.


