యూరియా కోసం రైతుల ఇక్కట్లు
●ఒక్క బస్తా యూరియా కోసం తిప్పలు
●మొక్కుబడిగా సొసైటీల్లో అమ్మకాలు
●వరి సాగులో తీవ్ర ఇబ్బందులు
తిరువూరు: యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అవి ఎలా ఉన్నాయంటే ‘వరి నాట్లు వేశాం, యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతున్నాం. సహకార సంఘాల్లో సోమవారం యూరియా సరఫరా చేస్తున్నారని తెలిసి తెల్లవారుజామునే క్యూలైన్లో నిలబడ్డాం. టోకెన్లు ఇచ్చి లైన్లో ఉండమన్నారు. మధ్యాహ్నం వరకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదు. మాకంటే వెనుక వచ్చిన పెద్ద రైతులకు ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చి పంపారు. ట్రాక్టర్లలో 50, 100 బస్తాల యూరియాను తరలిస్తుంటే అధికారులు పట్టించుకోవట్లేదు’ అని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలోని సన్న, చిన్నకారు రైతులు వాపోయారు. మునుకుళ్లలో రెండు విడతల్లో యూరియా కోరుతూ రైతు సేవా కేంద్రాల వద్ద వేచి ఉన్న రైతులు రిక్తహస్తాలతో వెనక్కి వెళ్లారు. మూడో విడతలో కొందరు రైతులకే బస్తాలు అందాయి. మునుకుళ్ల సొసైటీకి 400 బస్తాలు, లక్ష్మీపురం సొసైటీకి 500 బస్తాల యూరియా రాగా వందల మంది రైతులు బారులు తీరారు. మునుకుళ్ల సొసైటీ వద్ద ఎండలో నిలబడలేక తమ పట్టాదారు పాస్‌పుస్తకాలు, అడంగల్స్ జిరాక్సు కాపీలు, చెప్పులు లైన్లో ఉంచిన రైతులు టోకెన్లు పొందినా ప్రయోజనం లేకుండా పోయింది. వామకుంట్ల, అక్కపాలెం గ్రామాల రైతుల పేర్లు చెప్పి మునుకుళ్లలోని పెద్ద రైతులు యూరియా కట్టలు తరలించుకుపోతుంటే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నామని చిన్న, సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరిసాగుకు యూరియా కీలకం
ప్రస్తుతం నాట్లు వేసిన వరిపైరులో యూరియా చాలా అవసరం. కనీసం ఎకరాకు ఒక బస్తా వేసినా పంట నిలబడుతుంది. మార్కెట్లో యూరియా అమ్మకాలు లేకపోవడం, సొసైటీల్లో అరకొరగా మాత్రమే సరఫరా జరుగుతుండటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు మండలంలో 10 వేల ఎకరాల్లో ఇంతవరకు వరి నాట్లు పడగా, మొదటివిడత యూరియా వేసి రెండో విడత కోసం ఎదురుచూస్తున్నామంటూ పలువురు చెబుతున్నారు.
యూరియా కోసం రైతుల ఇక్కట్లు


