గొలుసు దొంగలకు అరదండాలు
●నిందితుడు ర్యాపిడో పైలెట్
●చోరీల్లో మైనర్ భాగస్వామ్యం
పటమట(విజయవాడతూర్పు): దుర్వ్యసనాలకు అలవాటు పడి రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో గొలుసు దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పటమట పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచారు. దీనిపై సెంట్రల్ ఏసీపీ దామోదర్, పటమట సీఐ పవన్ కిషోర్ సోమవారం పటమట పీఎస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు– చైన్ స్నాచింగ్‌లను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించి విజయవాడలో అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేశామన్నారు. పటమట దర్శిపేట మర్రిచెట్టు ప్రాంతానికి చెందిన మోదుగుల రాజారావు ప్రైవేట్ కాలేజీలో పని చేస్తూ, పార్ట్ టైమ్‌గా ర్యాపిడో రైడర్ కూడా చేస్తుంటారు. వ్యవసనాలకు బానిసైన రాజారావుకు అతని సంపాదన సరిపోవడం లేదు. తక్కువ కాలంలో బాగా డబ్బు సంపాదించాలనే కోరికతో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల వద్ద చైన్లను స్నాచింగ్ చేయటం, లేదా వారిని బెదిరించి దొంగతనం చేయడం పరిపాటిగా మారిందన్నారు.
మోటార్‌సైకిల్‌పై రెక్కీ
ఇతనికి స్థానిక మైనర్ భాగస్వామి కావటంతో నగర పరిసరప్రాంతాల్లో మోటార్ సైకల్‌పై రెక్కి నిర్వహించేవారని, ఇటీవల పటమట పీఎస్ పరిధిలో రెండు స్నాచింగ్‌లు చేశారని తెలిపారు. రామలింగేశ్వర్ నగర్ పుట్టరోడ్డులో, ఎంజీ రోడ్డు లో ఉన్న స్టీల్ షాప్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల మెడలో రెండు చైన్ స్నాచింగ్‌లు చేశారన్నారు. దీనిపై నమోదైన కేసు విచారణలో క్రైం ఎస్.ఐ డి.హరికృష్ణ, ఏ.ఎస్.ఐ వి.గోపి, హెడ్ కానిస్టేబుల్ కాళీ, ఇతర సిబ్బందితో నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
వీరికి అందిన పక్కా సమాచారంతో పటమట దర్శిపేట మర్రిచెట్టు వద్ద వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు. నిందితుల వద్ద సుమారు రూ. 3.50 లక్షల విలువైన 34 గ్రాముల బంగారు ఆభరణాలు (చోరీ సొత్తు)ను, నేరానికి ఉపయోగించిన చాకు, ద్విచక్ర వాహన్నాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.


