
రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. తమ్ముడికి గాయాలు
కొక్కిలిగడ్డ(మోపిదేవి): మోపిదేవి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా, తమ్ముడికి గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆనందంతో తల్లిదండ్రులు, స్నేహితులతో సెలవులు గడుపుదామని ఇంటికి వచ్చిన శివతేజస్(15) రోడ్డు ప్రమాదానికి గురై అందరికీ దూరమయ్యాడు. తమ్ముడు శివజస్వంత్ చేతులు విరిగి తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. దీంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామానికి చెందిన రాయన నరసింహారావు కుమారులిద్దరూ శివతేజస్, శివ జస్వంత్ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై ఆదివారం సాయంత్రం మోపిదేవికి బయలు దేరారు. 216 జాతీయ రహదారిపైకి వచ్చిన ద్విచక్ర వాహ నాన్ని చల్లపల్లి నుంచి అతివేగంగా మోపిదేవి వైపు వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కావడంతో వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మచిలీపట్నం హాస్పి టల్‌కు తరలించారు. దారిలోనే శివతేజస్ మృతి చెందగా, తమ్ముడు శివజస్వంత్‌కు చేయి విరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి నరసింహారావు పామర్రు అగ్నిమాపక కేంద్రంలో, ఆయన భార్య శ్రీలక్ష్మి అవనిగడ్డలో ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నారు. విజయవాడ చైతన్య కళాశాలలో ఫస్ట్ ఇంటర్ చదువుతున్న శివతేజస్ సెలవులకు ఇంటికి వచ్చారు.
ఉత్తమ మార్కులతో
ఉత్తీర్ణత..
తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో శివతేజస్ ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గంటల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చల్లపల్లి సీఐ ఈశ్వరరావు తెలిపారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. తమ్ముడికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. తమ్ముడికి గాయాలు