
వక్ఫ్ సవరణ బిల్లు ప్రమాదకరం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు దేశానికి చాలా ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో పంజాసెంటర్‌లో శనివారం సాయంత్రం వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి నారాయణ మాట్లాడుతూ.. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నిందన్నారు. అందులో భాగంగానే అన్ని రాజ్యంగ వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయిస్తోందన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వక్ఫ్‌బిల్లు ఆమోదంపై చంద్రబాబు మూడు సూచనలు చేశానని చెబుతున్నాడని, అవి ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు మూడు నామాలు పెట్టిన చంద్రబాబు తన బోగస్ మాటలు ఆపాలని హితవు పలికారు. చంద్ర బాబు, పవన్‌కల్యాణ్ బీజేపీకి లొంగిపోయారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ కేవలం మైనార్టీలకు మాత్రమే చెందిన అంశం కాదని, ఇది రాజ్యాంగంపై దాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సమితి కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ