
ఉపాధి కూలీల ఆకలి కేకలు
● జనవరి 17 నుంచి రూ.18 కోట్ల మేర వేతన బకాయిలు ● పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపని కూలీలు ● సిబ్బంది మెడపై వేలాడుతున్న లక్ష్యాల కత్తి ● రూ.70 కోట్లు మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధి హామీ పథకం కింద ఉన్న ఊళ్లో ఉపాధి దొరికినా చేసిన పనికి సకాలంలో వేతనం అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. నాలుగు కారం మెతుకులు మింగి, నీళ్లు తాగి కాలం వెళ్లదీస్తున్నారు. వేతనం రాని పనికి వెళ్లే కంటే వలస వెళ్లడం మేలని కొందరు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. గ్రామీణ నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం, వలసల నివారణే లక్ష్యంగా ఏర్పాటైన ఈ పథకం ఉద్దేశం నీరుగారుతోంది. వారం రోజుల్లో చేసిన పనికి వేతనం ఇవ్వాలన్న నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. ఆరుబయట ఎండలో రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసిన కూలీలకు రెండు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. మరో వైపు మెటీరియల్ కాంపొనెంట్ నిధులు కోట్లల్లో బకాయిలు పడ్డాయి. ఆర్నెల్లుగా కార్యాలయ నిర్వహణ ఖర్చులు లేక వ్యవస్థ చతికిలపడింది.
నిబంధనల ప్రకారం వారంలోగా వేతనం ఇవ్వాలి
ఎన్టీఆర్ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరడం లేదు. వేసవిలో వ్యవసాయ కూలీలకు పనులు దొరకవు. ఈ పథకం కింద పనులు గుర్తించి కూలీలకు ఉపాఽధి కల్పించాలి. ఒక్కొక్కరికి రోజుకు రూ.300 వేతనం అందించాలి. తాజాగా ప్రభుత్వం వేతనం రూ.307గా నిర్ణయించింది. పనులు చేసిన కూలీలకు నిబంధనల ప్రకారం వారంలోపు వేతనం అందించాలి. కానీ ఇదంతా కాగితాలకే పరిమితమైంది. ఉపాధి హామీ పథకంలో పనులు కల్పిస్తున్నా గత రెండు నెలలుగా కూలీలకు వేతనాలు జమ చేయడం లేదు. వేతనాలు ఎప్పటికి వస్తాయో చెప్పలేని పరిస్థితి. జిల్లాలోని 16 మండలాల్లో 6 లక్షల పనిదినాలకు జనవరి 7 నుంచి వేతనాలు అందడం లేదు. రూ.16 నుంచి రూ.18 కోట్లు వేతన బకాయిలు ఉన్నాయి.
కార్యాలయ నిర్వహణకు కూడా డబ్బుల్లేవు
పథకంలో చేపట్టిన పనులకు సంబంధించి డిసెంబర్ నుంచి బకాయిలు ఉన్నాయి. మెటీరియల్ కాంపొనెంట్ కింద జిల్లాలో రూ.70 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఓ వైపు కూలీలకు వేతనాలు అందక పనులు ముందుకు సాగడం లేదు. వీటికి తోడు మండలాల్లో కార్యాలయ నిర్వహణకు డబ్బులు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
లక్ష్యాలు నిర్దేశించి ఉన్నతాధికారుల వేధింపులు
ఉపాధి హామీ పథకానికి లక్ష్యాలు నిర్దేశించి వాటిని చేరుకోవాలని దిగువ స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వారం వారం కూలీలకు వేతనాలు అందితే పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారని, కానీ రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా లక్ష్యాలు చేరుకోవాలంటే ఎలా అంటూ కొందరు సిబ్బంది తమలో తాము మథన పడుతున్నారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి మెడపై కత్తి పెట్టి మరీ లక్ష్యాలు చేరుకోవాలంటున్నారని, కార్యాలయాల నిర్వహణకు పైసా ఇవ్వకుండా సస్పెండ్ చేస్తాం. షోకాజ్ నోటీసులు ఇస్తామంటూ తీవ్రమైన వత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు.
పై నుంచి ఎండ మాడిపోతోంది...లోపల కడుపు కాలిపోతోంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉపాధి కూలీలు పనిచేయాల్సి వస్తోంది. మండే ఎండల్లో, కాలే కడుపుతో ఎన్నాళ్లని పనిచేయగలరు. రెండు నెలలకు పైగా వేతనాలు అందని పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులకు రావడానికి కూలీలు ఆసక్తి చూపడం లేదు. వలసలు నివారించడానికి ఉద్దేశించిన ఈ పథకం వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూలీలు వలసబాట పట్టాల్సిన దుస్థితిని కలుగజేస్తోంది. మరోవైపు ఉపాధి హామీ పథకం సిబ్బంది మెడపై లక్ష్యాల కత్తి వేలాడుతోంది.
కూలి డబ్బులు రావడం లేదు
వేసవిలో ఉపాధి పనులకు వెళుతున్నా. రెండు నెలల నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది. చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతికేది?
– మంద రాహేలు, చెవుటూరు
శానా ఇబ్బందిగా ఉంది
నేను వ్యవసాయ కూలి పనులకు వెళ్తాను. ఉపాధి పనికి వెళ్తే గతంలో వారంలో డబ్బులు ఇచ్చేవారు. కొద్ది రోజుల నుంచి డబ్బులు రావడం లేదు. శానా ఇబ్బందిగా ఉంది.
– నాగేశ్వరరావు, చెవుటూరు

ఉపాధి కూలీల ఆకలి కేకలు

ఉపాధి కూలీల ఆకలి కేకలు