
రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తోన్న ప్రభుత్వం
కృష్ణలంక(విజయవాడతూర్పు): లౌకిక రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించాలని, మతసామరస్యం కోరుతూ సొసైటీ ఫర్ కమ్యునల్ హార్మనీ ఆధ్వర్యంలో ఈనెల 13న విజయవాడ నగరంలోని సిద్ధార్థ అకాడెమీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సమైక్యతా శంఖారావం సదస్సును జయప్రదం చేయాలని నిర్వహణ జాతీయ కమిటీ చైర్మన్ కె.విజయరావు, రాష్ట్ర సమన్వయకర్త, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. గవర్నర్‌పేటలోని బాలోత్చవ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమైక్యతా శంఖారావం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. భిన్నమతాలు, జాతులు, భాషలు, వర్గాలు, సంస్కృతుల సమాహారంగా ఉన్న మనదేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలు సృష్టించే విధంగా పాలక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. 1947 చట్టం ప్రకారం చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, మసీదులు, చర్చీల విషయంలో ఎలాంటి జోక్యం ఉండరాదన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్‌లో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వందేళ్ల కిందటే స్వామి వివేకానంద చికాగోలో మనదేశ ఔన్నత్యంపై ప్రసంగించిన వైనాన్ని గుర్తుచేశారు. విజయరావు మాట్లాడుతూ సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ జాతీయస్థాయిలో మత సామరస్యం కోసం కృషి చేస్తుందన్నారు. 13న జరిగే సదస్సులో రాజ్యసభసభ్యుడు ఇమ్రాన్‌ప్రతాప్‌గదీ, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యూపీ మాజీమంత్రి మోయిద్‌అహ్మద్ తదితరులు వక్తలుగా పాల్గొంటారని వివరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు మాట్లాడుతూ ఇటీవల వివిధవర్గాల వారు వివిధరకాల శంఖారావాల పేరుతో నానాయాగి చేశారన్నారు. పాలకులే మతం, భక్తి పేరుతో రోజుకో మాటలు చెబుతున్నారని, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో మైనారిటీ హక్కుల రాష్ట్ర కన్వీనర్ షేక్ బాజీ, న్యాయవాది మతీన్, సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, రైతుసంఘ నాయకుడు వై.కేశవరావు, ఐద్వా నాయకురాలు శ్రీదేవి, అరస నాయకుడు మోతుకూరి రుణ్‌కుమార్, సూర్యారావు పాల్గొన్నారు.
మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు