స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భావించే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌లోని 10 మార్గదర్శక సూత్రాలను సాధించడంలో అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జిల్లా, మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, డీఎల్‌పీఓలు, వార్డు సచివాలయాల అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో అధికారులు కీలక పాత్ర పోషిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో నూతన ఆవిష్కరణలతో రోల్ మోడల్‌గా నిలుస్తున్న వారిని ప్రోత్సహించాలన్నారు. సమాజంలో జీరో పావర్టీని సాధించేందుకు అధికారులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. రాబోయే నాలుగేళ్లలో పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలలో ప్రజలను కీలక భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలన్నారు. సంపన్న కుటుంబాలు(మార్గదర్శి) నిస్సహాయ కుటుంబాలను (బంగారు కుటుంబం) దత్తత తీసుకుని వారి సమగ్రాబివృద్ధికి దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా మండల స్థాయిలో వర్క్‌షాపులు నిర్వహించి అధికారులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రతి ఏడాది 15 శాతం వృద్ధి రేటుతో అనుకున్న లక్ష్యాలను సాధించేలా ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు. గణాంకాల ప్రకారం సర్వీస్ సెక్టార్‌లో మన జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానం, పారిశ్రామిక వృద్ధిలో 5వ స్థానం, వ్యవసాయ రంగంలో 23వ స్థానంలో ఉన్నామని వివరించారు. అన్ని రంగాలలో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్, 2047 లక్ష్యాలను చేరుకునే విధంగా విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ తక్వియుద్దీన్, ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి
–


