
కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరం
పెనుగంచిప్రోలు: కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరమని వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ అన్నారు. మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలంలో కస్తూరి గోపి, నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో నల్లపు నరసింహారావు మిర్చి పంటలో నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇద్దరు రైతులు భూములు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేసి సరైన గిట్టుబాటు ధర రాని కారణంగా, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్‌తో మిర్చి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. రైతుల ఆత్మహత్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రైతుల తరుఫున వైఎస్సార్ సీపీ నిత్యం పోరాడుతోందని, తాము నిరసనలు తెలపటం వల్లనే ప్రభుత్వం దిగి వచ్చి క్వింటాకు రూ.11,781 ఇస్తామని చెప్పిందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం
జగ్గయ్యపేట: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై మంగళవారం గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. బైపాస్ రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద సుమారు 30 ఏళ్ల వ్యక్తి మృతదేహం ఉందంటూ జగ్గయ్యపేట రైల్వే సూపరింటెండెంట్ విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వైఎస్‌వీఆర్ ప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు పట్టాలపై శరీర భాగాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. ఘటనా స్థలంలో బిర్యానీ ప్యాకెట్లు, మద్యం సీసా ఉండటం చూస్తే సోమవారం రాత్రి రైలు ఢీకొని ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. శరీర భాగాలపై సినీ హీరో ప్రభాస్, ఆంజనేయస్వామి, శిలువ పచ్చబొట్లు ఉన్నాయి. మృతదేహాన్ని విజయవాడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. సమీపంలోని బంగారుపేటకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలకు 94917 36189 నంబర్‌లో సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు.
వాహనం ఢీ కొని యువకుడి దుర్మరణం
మైలవరం: టాటా ఏస్ వాహనం ఢీ కొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన పుల్లూరు గ్రామంలో మంగళవారం జరిగింది. మైలవరం మండలం పుల్లూరు గ్రామంలోని ప్రధాన రహదారిలోని హరీష్ హోటల్ వద్ద తిరువూరు నుంచి విజయవాడ వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో పుల్లూరు శివారు బాడవ గ్రామానికి చెందిన ఆకుతోట శ్రీనివాసరావు(30) మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేష్ కౌలుకు మూడు ఎకరాలు తీసుకుని మిర్చి సాగు చేశాడు. వచ్చిన దిగుబడికి ఽభవిష్యత్తులో ధర పెరుగుతుందని కోల్డ్‌స్టోరేజీలో నిల్వ చేశాడు. అయితే నరేష్ భార్య కృష్ణకుమారి(35) మిర్చి నిల్వ చేయకుండా అమ్మి బాకీలు కడదామని తెలిపింది. తన మాట వినకుండా మిర్చిని కోల్డ్‌స్టోరేజీలో నిల్వ చేశాడని మనస్తాపంతో నరేష్ భార్య కృష్ణకుమారి ఈనెల 6న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స సొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరం