
జనగణనలో కులగణన చేపట్టాలి
పటమట(విజయవాడతూర్పు): జనాభా దామాషాలో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు, సంక్షేమం – అభివృద్ధి సమపాళ్లలో అందించి, అందరికీ సామాజిక న్యాయం అందాలంటే తప్పనిసరిగా ఈసారి జనగణనతో పాటే సమగ్ర కులగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు చెప్పారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ఎన్ మూర్తి అధ్యక్షతన 45 బీసీ కుల సంఘ నాయకులతో సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసన మాట్లాడుతూ.. దేశంలో జనగణన జరగడం ఎంత ముఖ్యమో–కులగణన జరపడం అవసరమన్నారు. కులగణన విషయమై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ, అవలంబిస్తున్న నిర్లక్ష్యం, తాత్సార ధోరణులకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా ఓబీసీలు సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ నెల 27న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని, అనంతరం కళాక్షేత్రం వద్దనున్న మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలను సమర్పిస్తామన్నారు. సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే జగదీష్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు కుక్కల వీర వెంకట సత్యనారాయణ, ఉద్యోగ విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సీహెచ్ పుల్లారావు, కందిమళ్ల శేషగిరిరావు, దాసరి కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
యార్డుకు 1,44,446 బస్తాలు మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,44,443 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,41,802 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,900 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10 వేల నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,400 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,917 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.