తుది శ్వాస వరకు తెలుగు భాషాభివృద్ధికి కృషి
ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు
గుడ్లవల్లేరు: తెలుగు భాషాభివృద్ధికి తుది శ్వాస వరకు కృషి చేస్తానని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు. ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రతిష్టాత్మక కళారత్న(హంస) అవార్డు అందుకున్న ఆయనను సింగలూరులో భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్, సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత సుబ్బారావు మాట్లాడుతూ.. తెలుగు భాష కోసం ప్రపంచ దేశాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ హైస్కూల్ డైరెక్టర్ నారాయణం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ అవార్డు గ్రహీత గుత్తికొండ 60 ఏళ్ల పాటు తెలుగు భాషాభివృద్ధి కోసం ఉద్యమాన్ని నిర్విరామంగా చేయటం గర్వించదగ్గ విషయమన్నారు. గుడివాడ పుట్టి వెంకటేశ్వరరావు సామాజిక సంస్థ అధినేత పుట్టి నాగలక్ష్మి మాట్లాడుతూ.. ఎంతోమంది కవులు, కవయిత్రులను తయారు చేసిన ఘనత సుబ్బారావుదన్నారు. మచిలీపట్నం భావతరంగణి అధ్యక్షుడు భవిష్య మాట్లాడుతూ.. సినీ కవులతో పాటు రాష్ట్ర స్థాయి ప్రముఖులతో ఎన్నో తెలుగు భాషాభివృద్ధి కార్యక్రమాల సృష్టికర్త సుబ్బారావు అని కొనియాడారు. ఉప సర్పంచ్ నందం శ్రీనివాసరరావు, గ్రామస్తులు నందం నాగ సుధాకర్, మాచర్ల రమణయ్య, బిట్రా అర్జునరావు, నాగ మల్లేశ్వరరావు, పైడేశ్వరరావు, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.


