అక్రమాలకు అడ్డుకట్ట..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతులకు తెలియకుండా వారి పేరుతో రుణాలు తీసుకోవడం, తీసుకున్న రుణాలకు అధిక వడ్డీలు వసూలు చేయడం, అప్పు తీర్చినా కొన్నేళ్ల తర్వాత రైతులకు నోటీసులు ఇచ్చి మరలా రుణాల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం ఇలాంటివన్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నిత్యకృత్యం. రాజకీయ జోక్యంతో రికార్డులు తారు మారు చేయడం, సభ్యుల వివరాలు గల్లంతు చేయడం వంటివి జరిగేవి. ఇదంతా ఇపుడు గతం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. పీఏసీఎస్‌ల ద్వారా పారదర్శకంగా, అవినీతి రహితంగా రైతులకు సేవలు అందించేందుకు కంప్యూటరీకరణ ప్రక్రియ చేపట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ పూర్తయింది. పీఏసీఎస్‌లన్నీ మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి కంప్యూటర్ ఆధారిత సేవలు అందించనున్నాయి. బ్యాంకుల తరహాలో రైతులకు పూర్తి పారదర్శకంగా సేవలు అందిస్తాయి. ఇకపై రైతులు పీఏసీఎస్‌ల ద్వారా ఆన్‌లైన్ సేవలు పొందవచ్చు.
జిల్లాలో పరిస్థితి..
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు అందుతున్నాయి. ఇవి గాక రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సొసైటీలు అందిస్తున్నాయి. వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి పీఏసీఎల్‌లలో సేవలను మాన్యువల్ విధానంలో అందిస్తున్నాయి. గతంలో సొసైటీలు అవకతవకలు అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉండేవి. సొసైటీల్లో అధ్యక్షులుగా ఎన్నికైన కొందరు అక్రమాలకు పాల్పడడం, రైతుల సొమ్ము కాజేయడం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. 2004కి ముందు సహకార సొసైటీలు దివాలా తీశాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సొసైటీలకు జీవం పోసింది.
గత ప్రభుత్వంలో కీలక అడుగులు..
సొసైటీలను డీసీసీబీలు, ఎస్‌సీబీలకు అనుసంధానం చేయడం, రైతులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కంప్యూటరీకరణ చేపట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలో కంప్యూటరీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలో ముగిసింది. ప్రస్తుతం సొసైటీలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత సేవలు, పారదర్శకంగా అందించేందుకు సిద్ధమయ్యాయి.
మూడు దశల్లో కంప్యూటరీకరణ..
సహకార సంఘాల కంప్యూటరీకరణ మూడు దశల్లో చేపట్టారు. జిల్లాలోని 131 సహకార సంఘాల్లో మొదటి రెండు దశలు వంద శాతం పూర్తయ్యాయి. ఇక చివరిది ప్యార్లల్ రన్ ద్వారా 92 సంఘాల్లో పూర్తయింది. మరో రెండు రోజుల్లో మిగిలిన సంఘాల్లో పూర్తవుతుంది. కంప్యూటర్ ఆధారంగానే రైతులకు సేవలు అందించనున్నాయి.
– శ్రీనివాసరెడ్డి, జిల్లా సహకార అధికారి
కంప్యూటరీకరణలో భాగంగా ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతుల వివరాలు, వారి డిపాజిట్లు, రుణాలు, ఏ భూములపై రుణాలు తీసుకున్నారన్న వివరాలను పూర్తి స్థాయిలో సేకరించారు. శాసీ్త్రయ పద్ధతిలో రైతుల వివరాలు అప్‌డేట్ చేశారు. డేటా పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. సహకార సంఘాలు అన్ని శాఖలు, డీసీసీబీలు, ఆప్కాబ్, నాబార్డుకు అనుసంధానిస్తారు. రైతులు సొసైటీల ద్వారా తీసుకున్న, చెల్లించిన రుణాల వివరాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. జవాబుదారీ తనం పెరుగుతోంది. రికార్డుల నిర్వహణ కచ్చితంగా జరగడమే కాకుండా, అవినీతికి చెక్ పడుతుంది.


