చిట్టినగర్(విజయవాడపశ్చిమ): రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.1,350 కోట్లు టర్నోవర్ సాధించా లని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ది కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. డెయిరీ పాలక వర్గ సమావేశం గురువారం ఫ్యాక్టరీ ఆవరణలోని పరిపాలనా భవనంలో జరిగింది. చైర్మన్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డైరెక్టర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాడి రైతులకు మూడో విడత బోనస్‌గా రూ.18 కోట్లు చెల్లించేందుకు సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. దీంతో ఈ ఏడాది మూడు విడతల్లో రూ.50 కోట్ల బోనస్‌ను అందిస్తున్నామని వివరించారు. పాడి రైతు సంక్షేమానికి, పశు సంరక్షణ కింద గత ఆర్థిక సంవత్సరంలో సుమారుగా మరో రూ.18 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ఏడాది విజయ డెయిరీ రూ.50 కోట్ల లాభాలను ఆర్జించిందన్నారు. కొత్త ఏడాదిలో రూ.1,350 కోట్ల టర్నోవర్‌తో పాటు కొత్త మార్కెట్లకు విస్తరణ, నూతన ఉత్పత్తుల ఆవిష్కరకు, పాడి రైతుల ఆర్తికాభివృబ్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు దాసరి వెంకట బాలవర్ధనరావు, వుయ్యూరు అంజిరెడ్డి, అర్జా వెంకట నగేష్, చలసాని చక్రపాణి, వేమూరి సాయివెంకట రమణ, పాలడుగు వెంకట రామవరప్రసాద్ పాల్గొన్నారు.