విమానాశ్రయం(గన్నవరం): బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ గుండెను జీవన్‌దాన్‌లో భాగంగా గురువారం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ శరీరంలోని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకువచ్చారు. ఆమె గుండెను తిరుపతిలోని పద్మావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచిన గుండెను అంబులెన్స్‌లో గ్రీన్ చానల్ ద్వారా గుంటూరు నుంచి ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వైద్యుల పర్యవేక్షణలో గుండెను తిరుపతి విమానాశ్రయానికి తీసుకు వెళ్లారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు.
మెట్రో భూ సేకరణపై దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ మెట్రో ప్రాజెక్టు భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని, ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎంఆర్‌సీఎల్) అందించిన ప్రతిపాదనల ప్రకారం ఉమ్మడి తనిఖీలకు చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం జరిగిన మెట్రోరైలు కార్పొరేషన్ బోర్డు సమావేశానికి వర్చువల్‌గా కలెక్టర్ హాజరయ్యారు. సమావేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు భూ సేకరణ సంబంధిత అంశాలపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ సూచనలు చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫేజ్–1 విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు భూ సేకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫేజ్–1 కారిడార్ 1ఏ (గన్నవరం–పీఎన్‌బీఎస్), కారిడార్ 1బీ (పీఎన్‌బీఎస్–పెనమలూరు) భూ సేకరణ, నిధుల అంచనా తదితరాలపై అధ్యయనం చేస్తామన్నారు.