కొండాయపాలెం(పామర్రు): పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిలో కొండాయ పాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదమద్దాలి శివారు కొండాయపాలెం గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఢీ కొట్టిన లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పామర్రు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మరో లారీకి తాళ్లు కట్టి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. లారీడ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు మలుపులో లారీ ఆగి ఉండటంతో వేగం వస్తున్న లారీ డ్రైవర్ చూడక ఢీకొట్టాడని తెలుస్తోంది. లారీ డ్రైవర్ తోట్లవల్లూరు మండలం కళాసుమాలపల్లికి చెందిన గుంజ శ్రీనివాసరావుగా గుర్తించారు. బాధితుడిని మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లారీ ఢీ.. వృద్ధుడి మృతి
పాయకాపురం(విజయవాడరూరల్): నున్న పీఎస్ సమీపంలో ప్రకాష్‌నగర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న టి.పైడిరాజు (65)ను లారీ ఢీ కొనగా ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానాయక్‌నగర్‌కు చెందిన తాలాడి పైడిరాజు పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. చేపల మార్కెట్ వద్ద చేపలు కొనుగోలు చేసి వాటిని బాగు చేయించడానికి ప్రకాష్‌నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ.. అతన్ని ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన పైడిరాజు తలపై లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు టి.శ్రీను ఫిర్యాదుపై పోలీసులు కేసు నమాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
విక్రేతలు ముగ్గురికి అరదండాలు
పెనమలూరు: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పెనమలూరు ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా గంగూరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఆటోలో ముగ్గురు వ్యక్తులు పారిపోబోయారు. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పారిపోయాడు. పోలీసులు, రెవెన్యూ అధికారుల పంచనామా చేయగా వివరాలు వెల్లడయ్యాయి. కానూరు సనత్‌నగర్‌కు చెందిన కొండూరి మణికంఠ(కేటీఎం పండు), యనమలకుదురుకు చెందిన నరేల రామారావు, కొక్కిలిగడ్డ పవన్‌కుమార్ రాజమండ్రిలో రాజు అనే వ్యక్తి వద్ద 22 కేజీల గంజాయి కొన్నారు. గంజాయిని తరలిస్తుండగా గంగూరులో వాహనాల తనిఖీలో పట్టపడగా పవన్‌కుమార్ పారిపోయాడు. పట్టుబడిన ఇద్దరి వద్ద 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చగా నెల్లూరు జైలుకు తరలించారు.
మరో కేసులో..
యనమలకుదురులో గంజాయి అమ్ముతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. యనమలకుదురు డొంకరోడ్డులో గంజాయి అమ్ముతున్నారన్న సమాచరంతో పోలీసులు నిఘా వేయగా కృష్ణలంక తారకరామానగర్‌కు చెందిన కలింగపట్నం మనోహర్, యనమలకుదురుకు చెందిన మారుబోయిననాగరాజు, ఉసురుమోతు పవన్‌కల్యాణ్ గంజాయితో పట్టుబడ్డారు. వారి వద్ద రూ.9 వేలు నగదు కూడా స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.