రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ చేతుల మీదుగా ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ అందుకున్నారు. సోమవారం జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్‌ల డీఆర్‌ఎంలతో వర్చువల్ పద్ధతిలో జీఎం భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం విజయవాడ డివిజన్‌లో విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన గొల్లప్రోలు ఇంజినీరింగ్ సెక్షన్‌లోని ట్రాక్ మెయింటైనయిర్ ఎల్.వెంకటరమణ, అసిస్టెంట్ లోకోపైలెట్ టింకు యాదవ్, రాజమండ్రి మెకానికల్ విభాగంలోని టెక్నీషియన్–1 వై.యశ్వంత్‌కుమార్‌లకు జీఎం అరుణ్‌కుమార్ జైన్ అవార్డులను అందజేశారు. అవార్డులు సాధించిన డివిజన్ సిబ్బందిని డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.