పెనమలూరు: మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ క్రీడాకారులను ఈ నెల 30వ తేదీన ఎంపిక చేస్తామని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ సోమవారం తెలిపారు. ఏప్రిల్ నాలుగో తేదీన 13 జిల్లాల మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలు భీమవరంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణా జిల్లా క్రీడాకారులను ఈ నెల 30వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ సింగ్ నగర్ మనోహర్ జిమ్‌లో ఎంపిక చేస్తామన్నారు. 55 నుంచి నుంచి 85 కిలోల బరువు వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. 165 సెంటీమీటర్ల ఎత్తు లోపు, పైబడిన వారికి రెండు గ్రూపులుగా మోడల్ ఫిజిక్ పోటీలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 86867 71358, 85550 47808 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
జీఎస్‌ఎంసీకి కేంద్ర ప్రభుత్వ ప్రశంసా పత్రం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రీసెర్చ్ విభాగంలో చేసిన కృషికి గాను విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(జీఎస్‌ఎంసీ)కు కేంద్ర ప్రభుత్వ హెల్త్ అండ్ రీసెర్చ్ విభాగం ప్రశంసా పత్రం అందజేసింది. ఈ నెల 20వ తేదీన న్యూడిల్లీలో జరిగిన మెడికల్ కాలేజీస్ రీసెర్చ్ కనెక్ట్–2025 కార్యక్రమంలో ఐసీఎంఆర్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్, జాయింట్ సెక్రటరీ రిచా ఖోడా చేతుల మీదుగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ ఈ ప్రశంసా పత్రం అందుకున్నారు. దేశ వ్యాప్తంగా 118 మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్ యూనిట్లు (ఎంఆర్‌యూ) ఆ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించాయి. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ఏఆర్‌యూ నోడల్ అధికారి డాక్టర్ ఎన్.శ్రీదేవి, రీసెర్చ్ సైంటిస్ట్–సీ డాక్టర్ పి.మధుసూదన్ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత కృష్ణా జిల్లా లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. హ్యూమన్ రైట్స్ కన్వీనర్ లక్ష్మీఉష మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం కారణంగా కొత్త జబ్బులు వస్తున్నా యని ఆందోళన వ్యక్తంచేశారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గోవాడ ప్రశాంతి, డాక్టర్ గౌతమ్, రేవతి తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల
హక్కులకు భరోసా కల్పిస్తాం
విజయవాడలీగల్: వినియోగదారుల హక్కు లకు రక్షణ, భరోసా కల్పించేందుకు కృషిచేస్తా మని పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్‌లో అదనపు వినియోగదారుల కమిషన్ బెంచిని నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఇదొక మంచి వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో వినియోగదారుల ఫోరంలో 1,33,736 కేసులు నమోదవగా చాలా వరకు పరిష్కారం లభించిందన్నారు. వచ్చే జూన్ నుంచి పాఠశాలల్లో, కళాశాలల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్జూమర్ క్లబ్‌లు ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం రాష్ట్ర, జిల్లాస్థాయిలో కమిషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్, విజయవాడ వినియోగదారుల అదనపు బెంచ్ ఫోరం చైర్మన్ సీహెచ్.కిషోర్, సభ్యులు కె.శశికళ, బీబీఏ ప్రెసిడెంట్ చంద్ర మౌళి, సెక్రటరీ అరిగల శివరామప్రసాద్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్‌కుమార్, సుంకర రాజేంద్రప్రసాద్, బీబీఏ మాజీ అధ్యక్షుడు సోము కృష్ణమూర్తి పాల్గొన్నారు.
30న బాడీబిల్డింగ్ క్రీడాకారుల ఎంపిక
30న బాడీబిల్డింగ్ క్రీడాకారుల ఎంపిక