
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 26 నుంచి జనవరి 26వ తేదీ వరకు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడిన ప్రత్యేక అధికారి, కేంద్ర సెన్సెస్ ఆపరేషన్ డైరెక్టర్ ఎం.రామచంద్రుడు అధికారులకు సూచించారు. వీడియోకాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ పి. రాజాబాబుతో కలిసి ఈ కార్యక్రమంపై సన్నాహాక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. తొలుత డీపీవో నాగేశ్వరనాయక్ వికసిత్ భారత్ సంకల్పయాత్ర విశేషాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం రామచంద్రుడు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సంబంధిత శాఖల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించిందని చెప్పారు. ప్రతి రాష్ట్రానికి నోడల్ అధికారులను నియమించారని పేర్కొన్నారు.
రెండు లేదా మూడు జిల్లాలకు ఒక ప్రత్యేకాధికారిగా నియమించారన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న 17 సంక్షేమ పధకాలు అర్హులైన లబ్ధిదారులు సరిగ్గా వినియోగించుకుంటున్నారా, లేదా విచారించి ఇంకా ఎవరైనా అర్హులు ఉండి లబ్ధి పొందని వారు ఉంటే అటువంటి వారిని గుర్తించి పథకాలను అందజేయటం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ 60 రోజుల పాటు కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రధానంగా 34 ప్రభుత్వశాఖలను భాగస్వామ్యులను చేస్తున్నామన్నారు. సమావేశంలో డీఆర్వో పెద్ది రోజా, జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డీఆర్డీఏ పీడీ పీఎస్‌ఆర్ ప్రసాద్, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, డీఈవో తాహెరాసుల్తానా, డీఎస్‌వో పార్వతి, సీపీవో బద్రినారాయణ, జిల్లా పరిశ్రమల అధికారి వెంకట్రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రత్యేకాధికారి ఎం.రామచంద్రుడు
Comments
Please login to add a commentAdd a comment