162మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు | - | Sakshi
Sakshi News home page

162మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు

Jun 2 2023 1:44 AM | Updated on Jun 2 2023 1:44 AM

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో 162 మంది జర్నలిస్ట్‌లకు మొదటిదశలో అక్రెడిటేషన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ పి. రాజాబాబు తెలిపారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు రెండు సంవత్సరాల పాటు అర్హత కలిగిన జర్నలిస్ట్‌లకు మొదటి విడతలో నిబంధనలకు అనుగుణంగా మంజూరు చేశామన్నారు. మొదటి విడతలో మంజూరు కాని వారు సమాచారశాఖ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో నిబంధనల ప్రకారం అప్‌లోడ్‌ చేయాల్సిందిగా సూచించారు. ఆ దరఖాస్తును పరిశీలించి అర్హత మేరకు అక్రిడిటేషన్లు రెండో విడత మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి ఎం. వెంకటేశ్వరప్రసాద్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌ టి. పెద్దిరాజులు, కార్మికశాఖ అధికారి జి. విజయసారథి, రైల్వే అధికారి అమీర్‌, జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ సుమ, అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా అధికారుల సంఘం ఆవిర్భావం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా అధికారుల సంఘం ఆవిర్భవించింది. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు, అధికారుల సంఘం అధ్యక్షుడిగా కె మోహన్‌కుమార్‌(డీఆర్వో), కార్యదర్శి జె. సునీత(పీడీ, డ్వామా), కోశాధికారిగా ఎంహెచ్‌ రెహమాన్‌(ట్రెజరరీ అధికారి), అసోసియేట్‌ అధ్యక్షులుగా ఎం. రుక్మాందయ్య (ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌), ఉపాధ్యక్షులుగా ఎం. సుహాసిని(డీఎంఅండ్‌హెచ్‌ఓ), విద్యాసాగర్‌(జేడీ), సంయుక్త కార్యదర్శులుగా సీవీ రేణుక(డీఈవో), ఎ. వెంకటేశ్వరరావు(పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి), అలాగే కార్యవర్గ సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు.

కృష్ణానదిలో బీటెక్‌ విద్యార్థి మృతదేహం

తాడేపల్లిరూరల్‌: ఎంటీఎంసీ పరిధిలోని ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఆక్వా డెవిల్స్‌ సమీపంలో కృష్ణానది నీటిలో మృతదేహం ఉన్నట్లు స్విమ్మింగ్‌ చేసేవారు గురువారం గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాడేపల్లి ఎస్‌ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి కృష్ణానది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీయించారు. ఈ సందర్భంగా మృతుడి జేబులో ఉన్న ఐడీ కార్డ్‌ ఆధారంగా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌, కూకట్‌పల్లిలో బీఎన్‌ఆర్‌ కళాశా లలో బీటెక్‌ చదువుతున్న గోగిలోతు లోకేష్‌(21)గా గుర్తించామన్నారు. కాలేజీ యాజమాన్యం ద్వారా విద్యార్థి తండ్రి సూర్యాపేట జిలాకు చెందిన గోల్‌తండా సర్పంచ్‌ శంకర్‌కు సమాచారం ఇచ్చామని ఎస్‌ఐ తెలిపారు. గత నెల 29వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఐ మిస్‌యూ డాడీ, ఐ లవ్‌యూ డాడీ అంటూ తనకు మెసేజ్‌ చేశాడని, అయితే 30వ తేదీ 6 గంటలకు ఆ మెసేజ్‌ చూసుకుని తన కుమారుడికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చిందని తండ్రి చెప్పాడన్నారు. హైదరాబాద్‌లోని కాలేజీలోనూ, హాస్టల్‌లోనూ విచారణ చేశామని, ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, ఇంతలో ఇలా జరుగుతుందని అనుకోలేదని లోకేష్‌ తండ్రి వాపోయారని ఎస్‌ఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement