ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారత సంతతి వ్యక్తికి చేదు అనుభవం.. ఆగ్రహంతో ఊగిపోతూ ఆరోపణలు

UK Indian Origin Man Alleges Mumbai Covid Test Scam Viral - Sakshi

భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్‌లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన అనుభవం దృష్ట్యా..  కరోనా టెస్టులు, ఐసోలేషన్‌లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్‌ అంటూ వీడియోలో వ్యాఖ్యానించాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్‌బుక్‌ ద్వారా వైరల్‌ అవుతోంది. 

మనోజ్‌ లాద్వా యూకేలో సెటిల్‌ అయిన వ్యక్తి.  తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్‌ ‘హీథ్రో ఎయిర్‌పోర్ట్‌’ నుంచి విమానంలో వచ్చాడు.  విమానం ఎక్కే ముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. డిసెంబర్‌ 30న వర్జిన్‌ అట్లాంటిక్‌ ఫ్లయిట్‌లో ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిని కోరారు. అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్‌ సెంటర్‌కు షిఫ్ట్‌ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు.


ఈ అనుభవంపై ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అంతా మాయగా ఉంది. విమానంలో గట్టిగా పదిహేను మంది కంటే ఎక్కువమంది లేం. దిగగానే.. అదీ గంటల వ్యవధిలో పాజిటివ్‌ ఎలా నిర్ధారణ అవుతుంది? లండన్‌ ఎయిర్‌పోర్టులు రిపోర్టులు చూపించినా నమ్మకపోతే ఎలా? ఇండిపెండెంట్‌ పరీక్షలకు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడాయన. 

నాతో పాటు మరికొందరు ప్రయాణికులు గట్టిగా సిబ్బందిని నిలదీశాం.ఇక్కడి మార్గదర్శకాలు ఇష్టం లేకపోతే.. బయట డబ్బులు కట్టి అయినా క్వారంటైన్‌ సెంటర్‌లో ఉండాలంటూ బీఎంసీ అధికారులు(Brihanmumbai Municipal Corporation) బెదిరిస్తున్నారు’’ అంటూ  మనోజ్‌ లాద్వా ఆరోపించారు. ఇదిలా ఉంటే లాద్వా వీడియో తీసిన టైంలో.. వెనకాల మరికొంతమంది ప్రయాణికులు సెంటర్‌ నిర్వాహకులతో గొడవ పడుతున్నట్లు వాయిస్‌ వినిపించింది. అయితే ఎయిపోర్ట్‌ సిబ్బంది మాత్రం తాము అంతా పక్కాగా రూల్స్‌ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు.

చదవండి: కరోనాకు రెడ్‌ కార్పెట్‌ వేసి మరీ ఘన స్వాగతం?? ఎక్కడంటే..

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top