‘గల్ఫ్‌బంధు’తో ఆదుకోండి

Telangana Government Should Be Introduced Gulf Bandu Demanded By Migrant labourers - Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): దళితులు ఆర్థికంగా వృద్ధి చెందడానికి అమలు చేస్తున్న దళితబంధు పథకం తరహాలోనే గల్ఫ్‌ కార్మికుల కోసం గల్ఫ్‌బంధు పథకాన్ని అమలు చేయాలని వలస కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. గల్ఫ్‌ వలస కార్మికులకు అన్ని రకాలుగా ప్రయోజనాలను కల్పించడానికి ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అది కార్యరూపం దాల్చలేదు. మరో పక్క గల్ఫ్‌దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అండగా ఉండటానికి గల్ఫ్‌ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ కూడా వినిపిస్తోంది.

ప్రభుత్వ హామీ
2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా గల్ఫ్‌ కార్మికుల ఆంశం చర్చకు వచ్చింది. గల్ఫ్‌ వలస కార్మికుల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఆర్థికంగా లాభం జరుగుతోందని, అందువల్ల వారి శ్రేయస్సు కోసం ఒక మంచి పథకాన్ని అమలులోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు గల్ఫ్‌ కార్మికుల కోసం ఎలాంటి పథకం అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో దళితుల అభివృద్ధి కోసం రూ.10 లక్షల నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తున్న విధంగానే గల్ఫ్‌ వలస కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గల్ఫ్‌బంధు అమలు చేయాలని కార్మికుల నుంచి, వారికి అండగా ఉంటున్న సంఘాల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. ఎన్‌ఆర్‌ఐ పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కనీసం గల్ఫ్‌బంధు పథకం అమలు చేస్తే తెలంగాణ జిల్లాల్లో ఉన్న సుమారు 13 లక్షల గల్ఫ్‌ కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా అండ దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చేయూతనివ్వాలి – ఎస్‌వీరెడ్డి, కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ 
గల్ఫ్‌ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్‌బంధు అమలు చేయాలి. గల్ఫ్‌ కార్మికులలో కొందరే ఆర్థికంగా స్థిరపడ్డారు. మెజార్టీ కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. గల్ఫ్‌ కార్మికులకు చేయూతనివ్వడం ప్రభుత్వం బాధ్యత. 
 
ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలి  – నంగి దేవేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు, గల్ఫ్‌ కార్మిక సంఘాల ప్రతినిధి
గల్ఫ్‌ కార్మికులకు ప్రయోజనం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నోమార్లు హామీ ఇచ్చింది. ఆ హామీలను నిలబెట్టుకోవడానికి దళితబంధు తరహాలో గల్ఫ్‌బంధు లేదా మరేదైనా పథకం అమలు చేయాల్సిందే.     

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top