మెసా(అరిజోనా): ఫీనిక్స్‌లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్‌లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.
“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

దాతలకు సన్మానం
గ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.

హాస్యంతో హృదయాల హరివిల్లు
“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్‌కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్‌అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.

శంకర నేత్రాలయ సేవా లక్ష్యం
1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.
నిర్వాహకుల కృషి
వంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు.


