కాన్సాస్‌లో ఆకస్మిక వరదలు : ఏపీకి చెందిన టెకీ దుర్మరణం | Kansas flash floods Indian techie passed away after car gets swept away | Sakshi
Sakshi News home page

కాన్సాస్‌లో ఆకస్మిక వరదలు : ఏపీకి చెందిన టెకీ దుర్మరణం

Jul 1 2026 2:37 PM | Updated on Jul 1 2026 3:27 PM

Kansas flash floods Indian techie passed away after car gets swept away

అమెరికాలో కాన్సాస్‌లో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల్లో (Flash Floods) చిక్కుకుని వెంకటేష్ దొప్పలపూడి (33) అనే భారతీయ ఐటీ నిపుణుడు, ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని పర్చూరు మండలానికి చెందినవ్యక్తిగా గుర్తించారు. శనివారం మధ్యాహ్నం ఆయన హ్యూస్టన్ నుండి ఉత్తర దిశగా కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు పెద్దకుమారుడు దొప్పలపూడి వెంకటేష్‌ (33) విదేశాల్లో విద్యనభ్యసించేందుకు గతంలో అమెరికా వెళ్లాడు. వెంకటేష్ నెబ్రాస్కాలో నివసిస్తూ, H-1B వీసాపై అక్కడ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సౌత్-సెంట్రల్ కాన్సాస్‌లో కురిసిన భారీ వర్షాల (6 ఇంచుల కంటే ఎక్కువ వర్షపాతం) కారణంగా అకస్మాత్తుగా వరదలు పోటెత్తాయి. వెల్లింగ్టన్‌లోని 'సౌత్ ఆలివర్ రోడ్' బ్రిడ్జ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో మునిగిపోయింది. కారులో ఒకరు చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం అందించడంతో సమ్నర్ కౌంటీ ఎమర్జెన్సీ రెస్పాండర్స్ రంగంలోకి దిగారు.  అయిత వరద ఉధృతి, బలమైన ప్రవాహాల కారణంగా ప్రారంభంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్లు, ఎయిర్ యూనిట్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. కాన్సాస్ హైవే పెట్రోల్ ఎయిర్ యూనిట్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన గాలింపు అనంతరం ఆదివారం వెంకటేష్ మృతదేహాన్ని వెలికితీశారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!

హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై  ఎక్స్‌ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించింది. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, మృతదేహాన్ని భారతదేశానికి (స్వగ్రామానికి) తరలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని కన్సులేట్ పేర్కొంది. 

ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్‌ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement