ఖతార్ మృతుడి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసిన ఫ్రాన్స్ టీవీ

France Tv Interview Family Of Qatar Migrant Worker Died - Sakshi

ఖతార్ లో పని ప్రదేశంలో జరిగిన ప్రమాదం (వర్క్ సైట్ యాక్సిడెంట్) లో గత సంవత్సరం మృతి చెందిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురుకంటి జగన్ కుటుంబాన్ని బుధవారం  ఫ్రాన్స్ టీవీ ప్రతినిధి జెర్మేన్ బస్లే ఇంటర్వూ చేశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, విదేశీ జర్నలిస్టుకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. గల్ఫ్ మృతుడి కుటుంబ సభ్యుల తెలుగు సంభాషణను ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. 

ఖతార్ లో చనిపోయిన భారతీయ వలస కూలీల కుటుంబాల స్థితిగతులపై ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంగ్లీష్ దిన పత్రికలో ప్రచురితమైన బ్యానర్ వార్తా కథనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ వార్తా కథనంలో పేర్కొన్న తొమ్మిది మంది మృతుల్లో ఏడుగురు తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం.

గల్ఫ్ వలసల విశ్లేషకులు, అంతర్జాతీయ కార్మిక నిపుణుడు మంద భీంరెడ్డి, వలస కార్మికుల హక్కుల కార్యకర్త స్వదేశ్ పరికిపండ్ల ఇద్దరు కలిసి ఈ సమాచారాన్ని ఇంగ్లీష్ పత్రికకు అందించారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తా కథనంపై భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా ప్రయత్నించాలని దోహా ఖతార్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ కు చెందిన చేవెళ్ల లోక్ సభ ఎంపీ డా. గడ్డం రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన రాజ్య సభ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఖతార్ లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ని ట్విట్టర్ ద్వారా కోరారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విషయం పరిశీలిస్తామని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కథనానికి స్పందించిన సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు చిట్టాపూర్, ముత్యంపేట, డబ్బా గ్రామాల్లోని మూడు ఖతార్ మృతుల కుటుంబాలను కలిసి పరామర్శించి వారి పిల్లల చదువుల కోసం తలా రూ. 10 వేల ఆర్థిక సహాయం చేశారు. 

ఏ మరణం అయినా పరిహారం ఇవ్వాలి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి... ఖతార్ ఫుట్ బాల్ స్టేడియం పని ప్రదేశంలో జరిగిన మరణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని వలస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి అన్నారు.   భారీ ఆదాయాన్ని సమకూర్చే ఫుట్ బాల్ ప్రాజెక్టులో ప్రాణాలు వదిలిన వలస కార్మికులను ఆదుకోవడం ఖతార్ తో సహా అంతర్జాతీయ సంస్థల కనీస ధర్మం అని గల్ఫ్ కాంగ్రెస్ చైర్మన్ సింగిరెడ్డి నరేష్ అన్నారు. గుండెపోటు, ఆత్మహత్యలు, తదితర కారణాల వలన చనిపోయిన వలస కార్మికుల మరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అధిక ఉష్ణోగ్రత మరణాలు, పని ప్రదేశంలో ప్రమాద మరణాలను నివారించగలిగే వారు ఆయన అన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top