
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రవాస తెలంగాణీయులు అబుదాబిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎడారి ప్రాంతమైన అబుదాబిలో పూలు దొరకడం కష్టమైన నేపథ్యంలో, సంఘ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణ నుండి వందలాది కిలోల పూలను తెప్పించి నగరాన్ని పూల వనంగా మార్చారు.
శనివారం రాత్రి ఉదయం సామూహిక బతుకమ్మ తయారీతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యు.ఏ.ఈ.లోని భారత రాయబార కార్యాలయం నుంచి శ్జార్జీ జార్జ్ (First Secretary, Community Welfare and Coordination) ముఖ్య అతిథిగా విచ్చేసి, తెలంగాణ సంస్కృతిని ప్రశంసించారు. ఆయన ప్రవాస భారతీయుల సాంస్కృతిక అంకితభావాన్ని కొనియాడుతూ, “ఇలాంటి ఉత్సవాలు భారతీయతను ప్రపంచానికి పరిచయం చేస్తాయి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గౌరవ అధ్యక్షుడు జయచంద్రన్ నాయర్, గౌరవ ఉపాధ్యక్షుడు శ్షాజీ వి.కె., కర్ణాటక రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సర్వోత్తమ్ శెట్టి, మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు విజయ్ మానె, బీహార్ మరియు ఝార్ఖండ్ సంఘ అధ్యక్షుడు దివాకర్ ప్రసాద్, ఇండియా ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంఘ అధ్యక్షుడు వినాయక్ ఆవాటే, సంపంగి బ్యుటికా సంస్థల యాజమాన్యం ప్రత్యేక అతిథులుగా పాల్గొని, ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు.
అలాగే, తమిళ సంఘం, మలయాళి సంఘం, కన్నడ సంఘం, మరాఠీ సంఘం, గుజరాతీ సంఘం, పంజాబీ సంఘం తదితర రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, బతుకమ్మ ఉత్సవాన్ని తమ హాజరుతో మరింత వైభవవంతం చేశారు. భారతీయ సమైక్యతకు ప్రతీకగా, వారు తమ సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ కవి, గాయకుడు డా. కోకిల నాగరాజు, యువ గాయని సోనీ యాదర్ల ప్రత్యేకంగా ఇండియా నుంచి విచ్చేసి తమ బతుకమ్మ ఆట పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు.

డప్పు వాయిద్యాలు, కోలాటాలతో బతుకమ్మ ప్రాంగణం మరో తెలంగాణ ను తలపించింది. అందమైన బతుకమ్మలకు, ముందుగా వచ్చిన బతుకమ్మలకు, నాట్యం చేసిన మహిళలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఇండియా నుండి తెప్పించిన పిండి వంటలు—అరిసెలు, గారెలు, బోబట్ల వంటి వంటకాలు—అందరినీ ఆకట్టుకున్నాయి.
బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మరింత ప్రాశస్త్యం పొందుతూ అందరి మన్ననలు పొందుతున్నందుకు కార్యవర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కార్య నిర్వాహకులు రాజా శ్రీనివాస రావు, గంగారెడ్డి, వంశీ సందీప్, గోపాల్, సతీష్, పావని, అర్చన, దీప్తి, పద్మజ తదితరులు తెలియ జేశారు “విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం” అని నిర్వాహకులు తెలిపారు.
(చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు)