ఆస్ట్రేలియాలో అవధానార్చన

56th thatavarthi avadhanam in Australia supported by ATAI - Sakshi

తెలుగు‌ సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అష్టావధానం. భాష ,ఛందస్సు, వ్యాకరణం,  సమయస్ఫూర్తి, ధారణ ఏక కాలంలో నడుపుతూ చేసే ఈ సాహిత్యప్రక్రియ తెలుగు భాషా వైభవానికి నిత్యసాక్ష్యం. తటవర్తి గురుకులం ద్వారా వివిధ దేశాల పృచ్ఛకులతో అంతర్జాలంలో జరుగుతున్న అవధానార్చన ఈ ఏడాది ఇప్పటిదాకా 55 అవధానాలను పూర్తి చేసుకుని, 56వ అష్టావధానం ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నగరం వేదికగా భాషాభిమానుల నడుమ డిసెంబరు మూడున  ప్రత్యక్షంగా జరుగుతోంది.

తెలుగుభాషను తమ‌ సామాజిక భాషలలో ఒకటిగా గుర్తించిన ఆస్ట్రేలియాలో, తెలుగు భాషాభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తూ, పద్యరచనను నేర్పి నూతన పద్య కవులను తయారుచేస్తూ అవధానార్చనలు నిర్వహిస్తోంది తటవర్తి గురుకులం. ఈ కార్యక్రమం భారతదేశంలో ఆలయాల అభివృద్ధికి అంకితం చేస్తూ ఆస్ట్రేలియా ప్రథమ అవధాని తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి నిర్వహిస్తున్నారు. అవధాని, పృచ్ఛకులు, సంచాలకులు అందరూ మెల్బోర్న్ వారే అవ్వడం, అందులోనూ చంటిపిల్లల తల్లులు కూడా పృచ్ఛకులుగా వస్తూ‌ తమ భాషాభిమానాన్ని తెలుగు వైభవాన్ని చాటడానికి పూనుకోవడం గమనార్హం.

ఈ కార్యక్రమానికి సంచాలకులుగా, ఆస్ట్రేలియాలో‌ ప్రముఖ పద్యకవి డా.వేణుగోపాల్ రాజుపాలెం వ్యవహరిస్తున్నారు. పృచ్ఛకాంశాలైన సమస్యాపూరణం యామిని చతుర్వేదుల ,  దత్తపది మనోజ్ మోగంటి , వర్ణన అమరేందర్ అత్తాపురం , నిషిద్ధాక్షరి శ్రీనివాస్ బృందావనం, న్యస్తాక్షరి రాజశేఖర్ రావి, ఆశువు రంజిత ఓగిరాల, చిత్రానికి‌ పద్యం అర్చన విస్సావజ్ఝుల , అప్రస్తుతం పల్లవి యలమంచిలి నిర్వహిస్తున్నారు.

ఈ అవధానార్చనను ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు‌లో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అంకితంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ATAI వారు సహాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియా తెలుగు సాహిత్యానికి నూతన సొబగులద్దేందుకు సిద్ధమౌతున్నఈ విశిష్ట అవధానార్చన, ప్రవాసతీరాలలో తెలుగుభాషా వికాసానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆశిద్దాం. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top