అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష! | 2 People From Telugu Origin In USA Face 5-Year jail H-1B Visa Fraud | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!

Apr 21 2026 12:36 AM | Updated on Apr 21 2026 12:51 AM

2 People From Telugu Origin In USA Face 5-Year jail H-1B Visa Fraud

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.

తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. 

ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. 

అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. 

దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.

చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్ల‌ని జేడీ వాన్స్‌!

Advertisement
 
Advertisement
Advertisement