సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా చేసి ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించిన మిల్లర్లు ఇప్పుడు వణుకుతున్నారు. సీఐడీ విచారణ కొన సాగుతోంది. ఇప్పటికే పలువురు పరారీ లో ఉండగా.. ఉన్నతాధికారితోపాటు కొందరు మిల్లర్లను అరెస్ట్ చేశారు.
నిజామాబాద్‌అర్బన్: సన్నబియ్యానికి బదులు ఎఫ్‌సీఐకి దొడ్డు బియ్యం సరఫరా చేసిన కుంభకోణం వ్యవహారంలో సీఐడీ చర్యలు రైస్ మిల్లర్లను వణికిస్తున్నాయి. అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టిన సీఐడీ అధికారులు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారితోపాటు ఐదుగురు రైస్‌మిల్లర్లను అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేసినట్లు గుర్తించారు. సుమారు రూ.10.42 కోట్ల కుంభకోణం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అధికారుల తప్పిదాలు సైతం వెలుగులోకి వచ్చాయి. అధికారులు రైస్ మిల్లులను తనిఖీలు చేయకపోవడం, అంతేగాక సీఎంఆర్ ఎగవేత, పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడం వంటి అనేక అంశాలు బయటకు వచ్చాయి. విచారణ మాత్రం సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా చేశారనే కోణంలో కొనసాగుతోంది. ప్రారంభంలో ఎనిమిది రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేపట్టిన సీఐడీ అధికారుల లిస్ట్‌లో మరో 30 మంది వరకు రైస్‌మిల్లర్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో కొంతమంది బడా రైస్ మిల్లర్లు ఉన్నారని తెలుస్తోంది. రైస్‌మిల్లర్ల నాయకుల్లో ఒకరు రూ.5 కోట్ల విలువైన సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
వసూళ్లు.. పంపకాలు
రైస్‌మిల్లుల యజమానులు మామూళ్లతో మాయ చేస్తూ వస్తున్నారనే విమర్శలున్నాయి. సంబంధిత అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులకు భారీ మొత్తంలో ముడుపులు అందజేస్తూ తమను ఎవ రూ ఏమీ చేయలేరనే ధీమాతో అక్రమాలకు పాల్పడ్డారని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో 410 వరకు రైస్ మిల్లులు ఉండగా.. ఇందులో 70 వరకు బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. నూతనంగా రైస్ మిల్లు ఏర్పాటు చేయాలంటే అసోసియేషన్‌కు రూ.3లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ధా న్యం సేకరణకు సంబంధించి ప్రతి క్వింటాల్‌కు రూ.3 చొప్పున అసోసియేషన్‌కు ప్రతి రైస్‌మిల్ యజమాని చెల్లించాలి. కేవలం వీటి ద్వారానే రూ.4 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూలు చేసిన డబ్బును ప్రతి ఏటా కొందరు ఉన్న తాధికారులకు, మరికొందరు ప్రజాప్రతినిధులకు ప్రతి ఏటా అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టించడంలో సంబంధిత శాఖకు చెందిన అధికారులు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో జిల్లా కేంద్రానికి చెందిన రెండు ముఠాల పాత్ర ఉన్నట్లు సమాచారం.
ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దు
సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా వ్యవహారంలో విచారణ కొనసాగుతున్న తరుణంలో సుమారు కొంత మంది రైస్‌మిల్లర్లు తమను అరెస్టు చేయొద్దని హై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈనెల 12వ తేదీ వరకు రైస్‌మిల్లర్లను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. సుమారు 10 రోజులపాటు పరారీలో ఉన్న రైస్‌మిల్లర్లలో అసోసియేషన్‌కు చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.
విచారణ కొనసాగుతోంది
సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా కేసులో 8 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో కొందరిని అరెస్టు చేశాం. పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. విచారణ ముగిసిన తర్వాత పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తాం.
– శ్రీనివాస్, సీఐడీ డీఎస్పీ
దొడ్డు బియ్యం సరఫరాలో
కదులుతున్న అవినీతి డొంక
వెలుగులోకి మరికొందరు
రైస్ మిల్లర్ల పేర్లు
పరారీలో సుమారు 80 మంది..
కొనసాగుతున్న విచారణ


