● ఇంటి బాట పట్టిన మెడికోలు..
● సస్పెన్షన్‌కు గురైన విద్యార్థుల
తల్లిదండ్రుల్లో ఆందోళన
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. జూనియర్లపై సీనియర్లు సాగించిన ర్యాగింగ్‌పై ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో సస్పెన్షన్‌కు గురైనవారు ఇప్పటికే ఇంటి బాట పట్టినట్లు తెలిసింది. కాగా కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
గత నెల 25వ తేదీన మొదటి సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు.. 14 మంది సీనియర్లు తమను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఎన్‌ఎంసీకి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఉన్నతాధికారులు గతనెల 28న కళాశాల ప్రిన్సిపల్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి, విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో 29వ తేదీన కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ర్యాగింగ్‌కు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా లభించినట్లు తెలిసింది. విచారణ నిమిత్తం ప్రిన్సిపల్ గదికి నలుగురు విద్యార్థులు సరైన వస్త్రధారణ లేకుండా రావడమే కాకుండా, కనీస బాధ్యత లేకుండా పొంతనలేని సమాధానాలు చెబుతూ అధికారులకు సహకరించలేదని సమాచారం. ఈ వివరాలతో కూడిన విచారణ నివేదికను యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎన్‌ఎంసీకి నివేదించింది. దీంతో బాధ్యులైన 14 మందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వీరిలో కొందరు కళాశాల హాస్టల్‌లో, మరికొందరు బయట ప్రైవేట్ గదుల్లో ఉంటూ చదువుకుంటున్నారు. సస్పెన్షన్ వేటు పడడంతో రెండు రోజుల క్రితమే వారంతా స్వగ్రామాలకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
నెల తర్వాత మరోసారి విచారణ..
ర్యాగింగ్ విషయంలో సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులపై నెల రోజుల తర్వాత మరోసారి విచారణ జరపనున్నారు. అప్పటికి వారిలో మార్పువస్తే సస్పెన్షన్‌ను ఎత్తివేసే అవకాశాలుంటాయి. అయితే తమ పిల్లలపై సస్పెన్షన్ వేటుతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మెడిసిన్ చదువుతున్న విద్యార్థులపై ఇలాంటి మచ్చ పడడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేరుగా ఫిర్యాదు చేయడంతో..
బాధితులు నేరుగా ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేయకుండా ఇక్కడి యాంటీ ర్యాగింగ్ కమిటీ దృష్టికి తెచ్చి ఉంటే చర్యలు వేరేలా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విషయం ఎన్‌ఎంసీ దాకా వెళ్లడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకున్నారని భావిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా హెచ్చరించి వదిలేశారని, అ యితే తాజా పరిణామాలతో ఇకపై ఎవరైనా ర్యా గింగ్ జోలికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.


