● కామారెడ్డి మెడికల్ కాలేజీలో జూనియర్లను వేధించిన సీనియర్లు
● ఎన్‌ఎంసీకి ఆన్‌లైన్‌లో
బాధితుల ఫిర్యాదు
● అంతర్గత విచారణ అనంతరం..
● 14 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లతో పలువురు సీనియర్ విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో అధికారులు చర్యలు తీసుకున్నారు. 14 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒక్కసారిగా ఇంతమందిపై వేటు పడడంతో విద్యార్థుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఘటనలో 14 మంది సీనియర్లను గుర్తించారు. ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఆరు నెలల పాటు, మరో 10 మందిని నాలుగు నెలల పాటు సస్పెండ్ చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులూ ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చర్యలను ఉపసంహరించుకోవాలని ప్రిన్సిపాల్‌ను వేడుకుంటున్నట్లు తెలిసింది. మంగళవారం ఉన్నతాధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ వాల్యా, హెచ్‌వోడీలు ఈ ఘటనపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ వాల్యాను ‘సాక్షి’ వివరణ కోరగా.. సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారంటూ జూనియర్లు ఆన్‌లైన్‌లో ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేశారన్నారు. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకున్నామన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. కళాశాల ఆవరణలోగానీ, హాస్టల్‌లోగానీ ర్యాగింగ్‌కు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ర్యాగింగ్ ఘటనలో 14 మంది మెడికోలపై వేటు పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫిర్యాదుతో వెలుగులోకి..
సీనియర్లు విద్యార్థులు కొందరు తమను వేధిస్తున్నారంటూ జూనియర్లు వారం రోజుల క్రితం ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్‌ఎంసీ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే అంతర్గత విచారణ చేపట్టారు. విచారణలో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది.


